Uttar Pradesh: ప్రభుత్వ సాయం పొందని 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం విచారణ చేస్తుంది. ఈ దర్యాప్తును ఎదుర్కొంటున్న దాదాపు 495కు పైగా అన్ ఎయిడెడ్ మదర్సాలు ఒక్క బహ్రైచ్ జిల్లాలోనే ఉన్నట్లు గుర్తించింది. ఏటీఎస్ దర్యాప్తు లిస్టులో ఉన్న దాదాపు 100కు పైగా మదర్సాలు భారత్ – నేపాల్ సరిహద్దు దగ్గర ఉన్నట్లు పేర్కొనింది. ఈ వివరాలను బ్రహైచ్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజయ్ మిశ్రా తెలిపారు.
Read Also: Krishna River: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
కాగా, ఉత్తరప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.రీబా ఈనెల 21వ తేదీన అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారులకు సంచలన ఆదేశాలతో ఒక లేఖను పంపించారు. రాష్ట్రంలోని అన్ని అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై ఎంక్వైరీ జరపాలని ఆ లేఖలో వెల్లడించారు. దర్యాప్తును ఎదుర్కోవాల్సిన 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల వివరాలతో కూడిన జాబితాను యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) డీజీపీకి అందజేశామని తెలిపారు. ఆయా మదర్సాలకు నిధులు ఎలా వస్తున్నాయనే దానిపై ఎక్కడికక్కడ విచారణ చేసి నివేదికను పంపాలని ఉత్తరప్రదేశ్ లోని ఏటీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.