PM Narendra Modi: మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీలో రూ. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్‌లో కాంగ్రెస్ నేత ఉండటాన్ని ప్రస్తావించారు. దేశంలోని యువతను డ్రగ్స్ వైపు నెట్టాలని, ఈ దందాలో వచ్చే డబ్బులను ఎన్నికలో వినియోగించి, గెలవాలని ఆ పార్టీ కోరుకుంటోందని ఆరోపించారు. అక్టోబర్ 02న దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని ఓ గోడౌన్‌లో ఢిల్లీ పోలీసులు 560 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5620 కోట్లగా అంచనా వేశారు.
Read Also: Vande Bharat: వందేభారత్‌పై రాళ్లదాడి.. విచారణలో సంచలన విషయాలు?
ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తుషార్ గోయల్‌కి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. అయితే, కాంగ్రెస్ మాత్రం అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. తుషార్ గోయల్ గతంలో 2022 వరకు ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ చైర్మన్‌గా పనిచేశాడనే విషయం విచారణలో వెల్లడైంది. అతడి సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఇప్పటికీ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్టీఐ సెల్ చైర్మన్ అనే బిరుదు ఇంకా ఉంది. 2022లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అతడిని పార్టీ నుంచి తొలగించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. అప్పటి నుంచి ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ పేర్కొంది.