CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న నితీష్ కుమార్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు.
ఇదిలా ఉంటే ఇప్పటి ఈ మాటల మంటలు చల్లారడం లేదు. బుధవారం ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ సిగ్గులేదు, మీరు ఇంకెంత దిగజారుతారు’’ అంటూ ఘాటు వ్యా్ఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు స్పందించకపోవడంపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ నితీష్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు. తాను భారతీయురాలినై ఉంటే.. ఆయన రాష్ట్రానికి వెళ్లి పోటీ చేస్తానని అన్నారు. ఆమె 2024 ఎన్నిలక గురించి, ప్రధాని మోడీ నాయకత్వం గురించి ప్రశంసించారు. మహిళా సాధికారత గురించి మోడీ చేసిన ప్రయత్నాలను గురించి ఎక్స్(ట్విట్టర్)లో మాట్లాడారు.
Read Also: Bengaluru : బెంగళూరులో భారీ వర్షాలు.. కూలిపోయిన పోలీసు ఆయుధశాల..
మిల్‌బెన్ వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్) నేత ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమెపై సెటైర్లు వేశారు. ‘‘ మేరీ మిల్‌బెన్‌కి మణిపూర్‌పై అభిప్రాయం ఉంది. బీహార్ సీఎం గురించి అభిప్రాయం ఉంది. 2024లో ఎవరికి ఓటేయాలనే దానిపై కూడా ఆమెకు ఒక అభిప్రాయం ఉంది. మేరీ మీరు యూఎస్ పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశ పౌరసత్వం పొందాలి. తద్వారా మోడీజీ సర్కార్ మాయాజాలాన్ని నిజంగా చూడొచ్చు. అప్పటి వరకు మేడమ్ దయచేసి కూర్చోండి’’ అంటూ పోస్ట్ చేసింది.
గతంలో మేరీ అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాదాలనపు తాకి వార్తల్లో నిలిచారు. గతంలో ప్రధాని మోడీకి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. బీహార్‌లో నాయకత్వం వహించేందుకు ఓ మహిళకు అధికారం ఇవ్వాలని బీజేపీని కోరారు. అంతకుముందు మేరీ మిల్‌బెన్ తన ట్వీట్ లో..‘‘ ఈ రోజు ఇండియాలోని బీహార్ ఒక నిర్ణయాత్మక ఘట్టాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడి మహిళల విలువ సవాల్ చేయబడుతోంది. దీనికి ఒకే సమాధానం ఉందని నేను నమ్ముతాను. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యల తర్వాత ధైర్యవంతులైన మహిళలు ముందుకు రావాలి. బీహార్ సీఎంగా పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించండి. నేను ఒకవేళ భారతీయ పౌరురాలినైతే బీహార్ వెళ్లి ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను’’ అని వీడియోలో పేర్కొంది.
బీహార్ అసెంబ్లీలో కులగణనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో సీఎం నితీష్ కుమార్ జనాభా నియంత్రణ గురించి ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో సంతానోత్పత్తి రేటు 4.2 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోయిందని, లైంగిక సంపర్కం సమయంలో స్త్రీకి తమ భర్తలను ఎలా నిరోధించాలో వివరించారు. భర్తలు చేసిన చర్యలు మరిన్ని జననాలకు దారి తీశాయని, అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా అడ్డుకోవాలో తెలుసని, అందుకే జననాలు తగ్గాయని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం వివాదంగా మారింది.