Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహ్మద్ ప్రవక్తను అవమానించడనే ఆరోపణలో ఓ వ్యక్తి బస్సు కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో పొడిచాడు. ప్రస్తుతం కండక్టర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. 20 ఏళ్ల యువకుడికి, కండక్టర్‌కి బస్సు టికెట్ ఛార్జీపై వివాదం మొదలైంది. ఆ తర్వాత అతనిని పొడిచాడు. ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడినందుకే కండక్టర్‌పై దాడి చేసినట్లు నిందితుడు ఓ వీడియోలో తన నేరాన్ని అంగీకరించాడు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ చేసి పట్టుకున్నారు. పారిపోతున్న క్రమంలో కాలిపై తుపాకీతో కాల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నిందితుడు లారెబ్ హష్మీ(20) అనే వ్యక్తి కండక్టర్ హరికేష్ విశ్వకర్మ(24)తో టికెట్ ధరపై గొడవ పెట్టుకున్నాడు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హష్మీ, విశ్వకర్మపై పదునైన కత్తితో దాడి చేశాడు. అతని మెడ, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి.
Read Also: India-Canada: “భారత్‌ని దోషిగా ఎలా నిర్ధారిస్తారు..?” నిజ్జర్ హత్యపై భారత రాయబారి వ్యాఖ్యలు..
ఘటన అనంతరం హష్మీ బస్సు నుంచి పారిపోయి కాలేజీ క్యాంపస్‌లోకి ప్రవేశించి దాక్కున్నారు. కాలేజీలో ఉన్న సమయంలోనే నేరాన్ని అంగీకరిస్తూ, బస్ కండక్టర్ దైవదూషణకు పాల్పడ్డట్లు ఆరోపించాడు, అందుకు దాడి చేశానని వెల్లడించాడు. ఈ వీడియోలో నిందితుడు ప్రధాని మోడీ, సీఎం యోగిల పేర్లను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బస్సులోపల శబ్ధం విని బస్సు నిలిపేసినట్లు బస్సు డ్రైవర్ మంగ్లా యాదవ్ తెలిపారు.
పోలీసులు కాలేజీలోపలే నిందితుడిని పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలో కాలిపై గాయపరిచి అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై విచారణ ప్రారంభించినట్లు డీసీపీ అభినవ్ త్యాగి తెలిపారు. అతని తండ్రి మహ్మద్ యూనస్ ఫౌల్ట్రీఫారం నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత కాలేజీ యాజమాన్యం నిందితుడిని సస్పెండ్ చేసింది.