UP Hospital Doctors Refused To Touch HIV+ Woman, She Lost Baby: డాక్టర్ వృత్తికే మచ్చ తీసుకువచ్చేలా ప్రవర్తించారు. వైద్యం కోసం వచ్చి హెచ్ఐవీ పాజిటివ్ మహిళకు వైద్యం అందించేందుకు నిరాకరించారు. కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. గర్బిణి అనే కనికరం లేకుండా వ్యవహారించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ వైద్యం కోసం సమీపంలోని ఫిరోజాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో కొన్ని గంటల పాటు ఆమెను వైద్యం అందించేందుకు నిరాకరించారు ప్రభుత్వ వైద్యులు. చివరకు ఆస్పత్రి ఉన్నతాధికారి జోక్యం చేసుకోవడంతో బిడ్డను ప్రసవించింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో శిశువు మరణించింది.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులను చంపిన ఉన్మాది..
పురిటినొప్పులతో 20 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు సోమవారం మధ్యాహ్నం ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే అంతకుముందు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు క్రిటికల్ గా ఉందని చెబుతూ.. వారు రూ.20,000 డిమాండ్ చేశారు. అయితే దీంతో సదరు బాధితురాలును ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కనీసం నా కుమార్తెను ముట్టుకోలేదని.. నా కుమార్తె నొప్పులతో తల్లడిల్లుతున్నా పట్టించుకోలేదని.. చివరకు ఆస్పత్రి ఇంఛార్జ్ కు ఫోన్ చేస్తే ఆమె వచ్చి జోక్యం చేసుకుని చికిత్స అందించారని మహిళ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు గంటల పాటు మహిళ ప్రసవ వేదనతో బాధపడుతున్నా.. ఒక్క వైద్యుడు కూడా పట్టించుకోలేదని, ఆమెకు చికిత్స చేయలేదని బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మధ్యాహ్నం 3 గంటలకు బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్చితే రాత్రి 9 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఆస్పత్రి ఇంఛార్జ్ సంగీత అనేజా, మహిళ హెచ్ఐవీ గురించి ఆమె కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరూ కూడా వైద్యులకు తెలియచేయలేదని అన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆమె హెచ్ఐవీ పరిస్థితి తెలియకపోవడంతో సాధారణ పేషెంట్ లాగే ఆమెకు అన్ని పరీక్షలు చేశామని, సిబ్బంది తనతో చెప్పారని ఆమె అన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలిందని.. రాత్రి 9 గంటలకు ప్రసవం జరిగిందని ఆమె తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.