ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. నేడు రెండవ విడతలో 55 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈవిడతలో అధికార బీజేపీకి సానుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. గట్టిపోటీని ఎదుర్కుంటున్నారు అధికార బీజేపీ అభ్యర్ధులు. షాజహాన్ పూర్, రాంపూర్ స్థానాలపైనే అందరి దృష్టి వుంది.
1989 నుంచి షాజహాన్ పూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్.ఎల్.ఏ గా ఎన్నికై, 9 వ సారి కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు సురేష్ ఖన్నా. రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పలుమార్లు ఎమ్.ఎల్.ఏ గా గెలిచి, ప్రస్తుతం రాంపూర్ లోకసభ స్థానానికి ఎమ్.పి గా ఉన్నారు ఆజం ఖాన్. ఈ విడతలో ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండటమే బీజేపీకి అంత అనుకూలంగా లేకపోవడానికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాంపూర్, సంభాల్, అమ్రోహా, ఛమ్రువా, నగినా లాంటి అసెంబ్లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వున్నారు.
గత అసెంబ్లీ (2017) ఎన్నికల్లో ఈ 55 స్థానాల్లో 38 స్థానాల్లో బిజేపి, 15 స్థానాల్లో సమాజవాది పార్టీ ( ఎస్.పి) గెలిచింది. అయితే, రెండేళ్ల తర్వాత, 2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కేవలం 27 అసెంబ్లీ స్థానాల్లోనే ఆధిక్యత నిలుపుకుంది బీజేపీ. సుమారు 25 అసెంబ్లీ స్థానాల్లో గెలుపును నిర్ధారించనున్నారు ముస్లింలు.
9 అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం పైగా ముస్లిం ఓటర్లు వుండడంతో బీజేపీకి గడ్డుపరిస్థితి తప్పదంటున్నారు. మరికొన్ని స్థానాల్లో 40 శాతం నుంచి 50 శాతం ముస్లిం ఓటర్లు వున్నారు. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు ( ఓబిసి) లు. గెలుపును నిర్ధారించే సామాజిక వర్గాలు వున్నాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్.పి. ఈసారి జయంత్ చౌధురి నేతృత్వంలోని ఆర్.ఎల్.డి తో పొత్తు కుదుర్చుకుంది. 2019 లో లోకసభ కు జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎస్.పి. 2019 లో లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఎస్.పి—బి.ఎస్.పి కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, ముస్లింలు. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో, మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో ఎస్.పి-బిఎస్పి కూటమి అధిక్యతను సాధించగా, మొత్తం 55 స్థానాల్లో బిజేపి కంటే అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకుంది ఎస్.పి-బిఎస్పి కూటమి. మొత్తం మీద బీజేపీ ఈ విడత ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేయాల్సిందే అంటున్నారు.