Uttar Pradesh: మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్న ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎమ్యెల్యేకి శిక్ష ఖరారైంది. తొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2014లో ఈ నేరం జరిగింది. బాధితురాలి సోదరుడు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. అయితే కుటుంబంపై ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డాడు.
సోన్‌భద్ర జిల్లాలోని దుద్ధి నియోజకవర్గానికి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామ్‌దులారే గోండ్‌కి శుక్రవారం ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది. 2014లో దుద్ధి నియోజకవర్గంలోని ఓ గ్రామపంచాయతీకి గోండ్ భార్య పెద్దగా ఉండేది. గోండ్ తన భార్య పదవిని ఆసరాగా చేసుకుని రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించాడు. నవంబర్ 4, 2014న బాలికపై గోండ్ అత్యాచారానికి పాల్పడగా.. మైయోర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
గోండ్ గతేడాది బీజేపీ టికెట్టుపై దుద్ది నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. దీంతో అతని కేసు సోన్‌భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. కోర్టు మంగళవారం ఇతడిని దోషిగా ప్రకటించగా.. ఈ రోజు శిక్ష విధించింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం(పోక్సో) పాటు, అత్యాచారం, ఐపీసీ సెక్షన్ల కింద రాందులారే గోండ్‌ని దోషిగా కోర్టు నిర్దారించింది. తమకు న్యాయం జరగడానికి చాలా సమయం పట్టిందని, అయితే తీర్పుతో సంతోషిస్తున్నామని చెప్పారు. కేసు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే భయపెట్టినట్లు బాధితు కుటుంబం ఆరోపించింది.
25 ఏళ్లు జైలు శిక్ష పడటంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గోండ్ తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యాడు. 403 మంది సభ్యులు ఉన్న యూపీ అసెంబ్లీలో బీజేపీకి 254 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతని అనర్హత పెద్దగా అధికారంపై ప్రభావం చూపకున్నా.. ప్రతిపక్షాల నుంచి బీజేపీ ఎదురుదాడి ఎదుర్కోనుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడిన చట్టసభ సభ్యుడు అనర్హుడిగా ప్రకటించబడుతాడు.