కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించకపోవడం వల్ల తన ఆదాయం తగ్గిందని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లి ఆదాయాన్ని చక్కదిద్దుకుంటానని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: Trump: నోబెల్ కోసం అలా చేయలేదు.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే పాట
సురేష్ గోపి త్రిస్సూర్ ఎంపీ. కేరళ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ. కేరళ నుంచి ఎంపికైన సురేష్ గోపికి మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అప్పటి వరకు మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. 2016 అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. 2024లో త్రిస్సూర్ లోక్‌సభ స్థానాన్ని కేటాయించడంతో విజయం సాధించారు. కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపినే కావడం విశేషం. కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: నేడు బందీల విడుదల.. ఇజ్రాయెల్‌కు ట్రంప్.. యుద్ధం ముగిసిందని ప్రకటన
ఆదివారం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. నిజాయితీగా చెబుతున్నా.. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సి.సదానందన్ మాస్టర్‌ను కేంద్రమంత్రిని చేయాలని సురేష్ గోపి అభ్యర్థించారు. సదానందన్ చాలా సీనియర్ నాయకుడు.. తన బాధ్యతను ఆయనకు అప్పగిస్తే కన్నూర్ జిల్లా రాజకీయాల్లో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పుకొచ్చారు. సదానందన్ ఎంపీ కార్యాలయం త్వరలో మంత్రి కార్యాలయంగా మారాలని ఆకాంక్షించారు. తనకు ఆదాయం తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలోనే తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. నటనను కొనసాగించి.. మరింత సంపాదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయినా తానెప్పుడు కేంద్రమంత్రిని కావాలని కోరుకోలేదన్నారు. తన సినిమా కెరీర్‌ను ఎప్పుడూ వదులుుకోవాలని భావించలేదని చెప్పుకొచ్చారు.
సదానందన్.. ప్రఖ్యాత ఉపాధ్యాయుడు. సామాజిక కార్యకర్త. బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా సీనియర్ నాయకుడు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జూలైలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేశారు. 1994లో జరిగిన హింసలో రెండు కాళ్లు పోయాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ వివాదం హింసాత్మకంగా మారినప్పుడు రెండు కాళ్లను ప్రత్యర్థులు నరికేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సదానందన్‌ను కేంద్రమంత్రిగా చేయాలని సురేష్ గోపి సిఫార్సు చేశారు. దీన్ని మోడీ పరిగణనలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
