Reservation: హర్యానాలో మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లును పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టేసింది. ప్రైవేట్ రంగంలో రాష్ట్ర నివాసితులకు 75 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేసే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్ యాక్ట్ 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులకు గురైంది. ఈ చట్టం ద్వారా నెలవారీ జీతం రూ.30,000 కన్నా తక్కువ ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లను హర్యానా రాష్ట్రంలోని నివాసితులకు కేటాయించారు. నివాసం ఉండాల్సిన సంవత్సరాలను 15 నుంచి 5 ఏళ్లకు తగ్గించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల ఓట్లను సంపాదించాలని అనుకున్న మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తాకినట్లైంది. ఈ తీర్పుపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
నవంబర్ 2020లో హర్యానా అసెంబ్లీ ఆమోదించిన ఈ చట్టం, మార్చి 2021లో గవర్నర్ ఆమోదం పొందింది, ఇది రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జననాయక్ జనతా పార్టీ, దాని అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ చౌతాల ఆలోచన నుంచే ఈ బిల్లు పుట్టింది. 2019 ముందు ఆయన ఈ హమీ ఇచ్చారు.
Read Also: Vijayashanti: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
తక్కువ జీతం ఉండే ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సామాజికంగా, ఆర్థికంగా, సాధారణ ప్రజల ప్రయోజనాలుగా పేర్కొంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా గురుగ్రామ్ ఇండస్ట్రీయల్ అసోసియేషన్, ఇతర యాజమాన్య సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇది యజమానుల రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ సూత్రాలకు విరుద్ధమని కూడా వారు పేర్కొన్నారు. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ కారిడార్ ఉన్న గురుగ్రామ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి.
పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఫిబ్రవరి 2022లో ఈ చట్టంపై స్టే విధించింది. హర్యానా ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసిన రోజుల తర్వాత ఆ ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టును కోరింది. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన న్యాయమూర్తులు జిఎస్ సంధావాలియా, హర్‌ప్రీత్ కౌర్ జీవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దానిని కొట్టివేసింది.