దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసు సంచలనం రేపింది. అయితే దీని కన్నా ముందుగా మహారాష్ట్రలో ఇదే తరహా హత్య జరిగింది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కారాతకంగా చంపారు దుండగులు. అయితే ముందుగా ఈ కేసును దోపిడి కేసుగా చెప్పిన పోలీసులు ప్రస్తుతం నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే హత్య చేశారని గుర్తించారు.
తాజాగా ఈ కేసుపై హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అమరావతి డీసీపీ విక్రమ్ సాలి వెల్లడించారు. ఆరుగురు నిందితులను ముదస్సిర్ అహ్మద్, షారుఖ్ పఠాన్, అబ్దుల్ తౌఫిక్, షోయబ్ ఖాన్, యూసుఫ్ ఖాన్ బహదూర్ ఖాన్ గా గుర్తించారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన ఏడవ నిందితులు షేక్ ఇర్ఫాన్ షేక్ రహీమ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఫైర్ అయ్యారు. ఈ కేసులు ఉదయ్ పూర్ హత్య తరహాలోనే ఉందని.. హత్య జరిగిన 12 రోజుల అమరావతి సీపీ వచ్చి చెప్పారని విమర్శించారు. ఈ కేసు విచారణపై హోమంత్రి అమిత్ షాకు లేఖ రాశామని.. దీంట్లో భాగంగానే ఎన్ఐఏ విచారణకు ఆయన ఆదేశించారని నవనీత్ చెప్పారు. ఇది దోపిడి అని కేసును అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. అమరావతి సీపీపై కూడా విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన ఉదయ్ పూర్ టైల కన్హయ్య లాల్ హత్యపై విచారణ వేగవంతం చేశారు. రాజస్థాన్ పోలీసులతో పాటు ఎన్ఐఏ విచారణ సాగిస్తోంది. ఇప్పటికే నిందితులిద్దరికీ పాకిస్తాన్ కు చెందిన దావత్-ఏ- ఇస్లామ్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిన్నజైపూర్ లోని ఎన్ఐఏ కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో నిందితులపై దాడి జరిగింది.