Jaishankar security breach: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఆయన ఓ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే సమయంలో ఖలిస్తానీలు నినాదాలు చేయడంతో పాటు ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని జైశంకర్ సమీపంలోకి రావడం, కారుని అడ్డుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై యూకే ప్రకటనపై భారత్ శుక్రవారం స్పందించింది. యూకే ఉదాసీనతను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు.
‘‘ఈ విషయంపై యూకే విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను మేము గమనించినప్పటికీ, దాని నిజాయితీపై మా అభిప్రాయం, మునుపటి సందర్భాలలో నిందితులపై తీసుకున్న చర్యలపై ఆధారపడి ఉంటుంది’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.
Read Also: CM Revanth Reddy: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది..
లండన్‌లో అంతర్జాతీయ థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్‌లో ప్రసంగం తర్వాత జైశకంర్ వెళ్లిపోతున్న సమయంలో ఖలిస్తానీలు భారత్‌కి వ్యతిరేక నినాదాలు చేశారు. ‘‘ఈ సంఘటనకు పెద్ద సందర్భం ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి శక్తుల బెదిరింపులకు లైసెన్సులు ఇచ్చినట్లు ఉంది. యూకేలో చట్టబద్ధమైన మా దౌత్య కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో ఉన్న ఇతర ఘటనల పట్ల ఉదాసీనతను ఈ ఘటన బయటకు తెస్తుంది’’ అని ఒకింత ఘాటుగానే స్పందించింది.
అంతకుముందు, గురువారం యూకేలోని కైర్ స్టార్మర్ ప్రభుత్వం ఖలిస్తానీ తీవ్రవాదుల ప్రయత్నాలను ఖండించింది. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. శాంతియుత నిరసన హక్కుని సమర్థిస్తున్నప్పటికీ, ప్రజా కార్యక్రమాలను బెదిరించడం, అంతరాయం కలిగించే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యాలయం తెలిపింది. భారత్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. చిన్న వేర్పాటువాద సమూహం శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛలను దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పింది.