మహారాష్ట్రలో వేగంగా పరిణామాాలు మారుతున్నాయి. ప్రస్తుతం శివసేన సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గంగా చీలిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి నుంచి రాజకీయం నడుపుతుండగా.. ఉద్ధవ్ వర్గం ముంబై కేంద్రంగా రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే సిఫారసు మేరకు డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు, అసెంబ్లీలో శివసేన ఫ్లోర్ లీడర్ గా ఏక్ నాథ్ షిండేను తప్పించి అజయ్ చౌదరిని డిప్యూటీ స్పీకర్ నియమించారు.
ఇదిలా ఉంటే రెబెల్ వర్గానికి షాక్ ఇచ్చాడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం రెబెల్ వర్గంలో ఉన్న ఎనిమిది మంది మంత్రుల శాఖలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, తుఫాన్ ముప్పు ఉండటంతో అందుబాటులో లేని 8 మంది మంత్రుల శాఖలను తొలగించినట్లు తెలుస్తోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వద్ద ఉన్న పట్టణాభివృద్ధి శాఖను కూడా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు.
ఇదిలా ఉంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి షిండే వర్గం మద్దతు ఉపసహరించుకున్నట్లు, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయనట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భర్తరఫ్ చేయాలని గవర్నర్ కు రెబెల్ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖలు రాసింది షిండే వర్గం.
ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు పెంచారు ఏక్ నాథ్ షిండే. గతంలోని సంఘటనలను తవ్వుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం షిండే వర్గాన్ని ద్రోహులు అంటూ విమర్శిస్తుంటే.. బాలా సాహెబ్ ఠాక్రేను అరెస్ట్ చేసిన వారితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉద్ధవ్ ఠాక్రే ప్రోత్సహిస్తున్నారని..వారికి మద్దతు ఇవ్వడం అంటే బాల్ ఠాక్రేను అవమానించడమే అంటూ షిండే విమర్శలు చేశారు. ఇటు శివసేన బీజేపీ పార్టీని టార్గెట్ చేసింది. ఒక్కో ఎమ్మెల్యేను రూ. 50 కోట్లకు కొంటున్నారని ఆరోపణలు చేసింది. మహారాష్ట్రలో బీజేపీదే అధికారం అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.