ఉత్సాహం ఉండాలి, కానీ అత్యుత్సాహం ఉండకూడదు. ఏం కాదులే అని ఆ అత్యుత్సాహాన్ని ఎక్కడిపడితే అక్కడ ప్రదర్శిస్తే మాత్రం.. బాక్స్ బద్దలవ్వడం ఖాయం! ఇప్పుడు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోయ్ విషయంలోనూ అదే జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారతదేశానికి సలహా ఇవ్వబోయి, గట్టి ఎదురుదెబ్బని ఎదుర్కొన్నాయన! దీంతో, మరో దారి లేక ఆయన వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ సభలో పలు తీర్మానాల్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. తటస్థ వైఖరినే పాటిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇదే సమయంలో యూకేలో నెదర్లాండ్స్ రాయబారిగా ఉన్న కారెల్.. ‘‘ఐక్యరాజ్యసమితి విధివిధానాల్ని మీరు (భారత్‌ను ఉద్దేశించి) గౌరవించాలి. జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌కు దూరంగా ఉండకూడదు’’ అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ గురించి ఐరాస భద్రతా మండలిలో ఈ వారం జరిగిన సమావేశంలో ప్రస్తావిస్తూ.. డచ్ రాయబారికి భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌కి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తామేం చేస్తున్నామో పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఐరాస విధానాలు, అంతర్జాతీయ చట్టాల్ని తాము పాటిస్తున్నామని.. అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవిస్తున్నామని చెప్పారు. ఈ దెబ్బకు, ఆ డచ్ రాయబారి తన ట్వీట్‌ని డిలీట్ చేశారు.