Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ‘‘సార్’’ అని సంభోదించారని ట్రంప్ అన్నారు. అపాచీ హెలికాప్టర్ల డెలివరీలపై ప్రధాని మోడీ తనను నేరుగా సంప్రదించారని చెప్పారు. హౌజ్ జీఓపీ మెంబర్ రిట్రీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్ కొన్నేళ్ల క్రితమే 68 అపాచీ హెలికాప్టర్లకు ఆర్డర్ చేసింది. ప్రధాని మోడీ నన్ను కలిసేందుకు వచ్చారు. సర్, మిమ్మల్ని కలవచ్చా? అని అడిగారు’’ అని అన్నారు. తనకు మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయితే, వాణిజ్య విధానాల విషయంలో మాత్రమే మోడీకి, తనకు మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మరినట్లు ట్రంప్ చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్ ఇప్పుడు భారీగా టారిఫ్స్ చెల్లిస్తోందని, అందుకే ఆయన నాపై అంతగా సంతోషంగా లేరని ట్రంప్ అన్నారు. కానీ, ఇప్పుడు భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలును బాగా తగ్గించారని ఆయన చెప్పారు. రష్యా నుంచి చమురు కొంటున్న కారణంగా యూఎస్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించింది.