Donald Trump: తాను చేస్తే న్యాయం, అదే ఇతరులు చేస్తే అన్యాయం అన్న రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అమెరికా రష్యాతో వ్యాపారం చేసుకోవచ్చు, కానీ భారత్ చేస్తే మాత్రం అది ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడం అని విమర్శిస్తోంది. ఇదే కారణం చెబుతూ ట్రంప్, భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించారు. అయితే, అంతటితో ఆగకుండా తాను చేస్తున్న పనినే మీరు చేయాలంటూ పలు దేశాలకు అమెరికా సూచిస్తోంది. ఇందతా చూస్తుంటే ‘‘తాను చెడిన కోతి వనమంతా చెరిచింది’’ అనే రీతిలో ట్రంప్ వ్యవహారం కొనసాగుతోంది.
ఇప్పుడు అమెరికా విధిస్తున్నట్లే ఇజ్రాయిల్, యూరోపియన్ యూనియన్, ఇతర యూరోపియన్ దేశాలు భారత్‌పై సుంకాలు విధించాలని వైట్ హౌజ్ ఆయా దేశాలను కోరుతోంది. సుంకాలతో భారత్‌ని లొంగదీసుకోవచ్చని భావించిన ట్రంప్‌కి ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు వేరే దేశాలను ఉపయోగించి భారత్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. సుంకాలు విధించిన తర్వాత కూడా రష్యాతో స్నేహాన్ని విడిచిపెట్టమని స్పష్టమైన వైఖరిని భారత్ ప్రదర్శించింది. యథావిధిగా రష్యన్ ఆయిల్‌ని కొనుగోలు చేస్తోంది. ఇదే కాకుండా చైనాతో భారత్ సంబంధాలను మెరుగుపడుతున్నాయి. ఓ రకంగా చూస్తే, భారత్‌ని చైనాకు పరోక్షంగా అమెరికానే దగ్గర చేసింది.
Read Also: Brain Infection: కేరళను భయపెడుతున్న అరుదైన ‘‘బ్రెయిన్ ఇన్ఫెక్షన్’’.. మరో ఇద్దరు మృతి..
తాజాగా, భారత్ నుంచి కొనుగోలు చేసే గ్యాస్, చమురును పూర్తిగా నిలిపేయాలని అమెరికా యూరప్‌ని కోరుతోంది. ఒక వేళ చమురు కొనుగోలును ఆపకుంటే, తమ లాగే భారత్‌పై సుంకాలు విధించాలని కోరింది. నిజానికి, రష్యా నుంచి భారత్ కన్నా ఎక్కువగా చైనా రష్యన్ ఆయిల్‌ని కొనుగోలు చేస్తోంది, అయినప్పటికీ ఆ దేశంపై ట్రంప్ సుంకాలు వేసే సాహసం చేయడం లేదు.
మరోవైపు, భారత్‌కి మరో మిత్ర దేశం ఇజ్రాయిల్‌ని కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్‌తో సంబంధాలు తగ్గించుకోవాలని కోరుతోందని తెలుస్తోంది. భారత్‌కి రక్షణ రంగంలో ఇజ్రాయిల్‌తో దశాబ్ధాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్ రక్షణ ఉత్పత్తులకు భారత్ అతిపెద్ద మార్కెట్. ఇజ్రాయిల్ టెక్నాలజీ సాయంతో భారత్ అనేక ఆయుధాలు తయారు చేస్తోంది. ఇటీవల ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో ఇజ్రాయిలీ టెక్నాలజీ ‘‘స్కై స్ట్రైకర్’’ డ్రోన్లను ఉపయోగించి పాక్ పథకాలను తిప్పికొట్టాం. ఇదే కాకుండా ఇజ్రాయిల్ లేజర్ గైడెడ్ మిస్సైళ్లను భారత్ వాడుతోంది. ఇప్పుడు భారత్‌తో రక్షణ రంగ సహకారం, టెక్నాలజీ షేరింగ్‌ను తగ్గించుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.