Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే మాటలు చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్తాన్ సంఘర్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను ఆపినందుకు ట్రంప్ తనకు తాను ఘనత వహించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ‘సుదీర్ఘ రాత్రి’ చర్చల తర్వాత భారత్, పాక్ ‘‘పూర్తి, తక్షణ’’ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదివారం ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గతంలో కూడా ట్రంప్ పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు.
Read Also: USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఘర్షణలను ముగించినందుకు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ తాజా వాదన వచ్చింది. దీనికి ఒక రోజు ముందు ట్రంప్ న్యూస్ మాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చాలా యుద్ధాలను పరిష్కరించానని చెప్పుకొచ్చారు. వాణిజ్యంతో తాను యుద్ధాలను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ సైన్యం కవ్విస్తే, వారి ఎయిర్‌బేస్‌లపై విరుచుకుపడింది. అయితే, ఈ సంఘర్షణను తానే ఆపానని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే, ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేదని గతంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. కాల్పుల విరమణలో మూడవ పక్షం జోక్యం లేదని, పాకిస్తాన్ అడిగితేనే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ఏ ప్రపంచ నాయకుడు కూడా భారత్‌ని కోరలేదని పార్లమెంట్‌లో ప్రధాని మోడీ స్పష్టం చేశారు.