నేటి నుంచి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ..
ఇవాళ మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని నాలుగు లక్షల 60వేల మంది విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ జరగనుంది.. అంతేకాదు, హైస్కూళ్లలోని దాదాపు 60 వేల మంది టీచర్లకు కూడా ట్యాబ్‌లు అందించనుంది ఏపీ సర్కార్.. విద్యార్థులకు ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు అధికారులు.. ట్రయల్ మెథడ్‌లో నిడమానూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు పంపిణీ చేశారు.. ఆఫ్ లైన్ ఫార్మెట్‌లో ట్యాబ్‌లు అందిస్తారు.. బైజూస్ కంటెంట్‌ని అప్‌లోడ్ చేసిన ఆ ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు.. కోర్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాల వీడియోలు, ఎక్సర్‌సైజులు ఆ ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు. విద్యార్ధుల లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ట్యాబ్‌లు పెంచుతాయని అంచనా వేస్తున్నారు.. అయితే, ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు సీఎం జగన్.. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1972 డిసెంబరు 21న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించిన ఆయన.. ఓవైపు వ్యాపారం చేస్తూనే.. రాజకీయాల్లోనూ రాణించారు.. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం అందుకున్నారు.. ఇక, ఈసారి రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. అయితే, వైసీపీ శ్రేణులు, సీఎం జగన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ సంబరాలు నిర్వహిస్తున్నారు.. వస్త్ర, అన్నదానాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రెడ్‌క్రాస్‌తో కలిసి భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఇక, రాష్ట్రమంతా మొక్క నాటేందుకు సిద్ధం అయ్యారు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ ఛార్జిషీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూపొందించింది. కవిత వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఎమ్మెల్సీ కవితతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌ల పేర్లను చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లోని కీలకాంశాలు తాజాగా లీకయ్యాయి. సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం ఉన్నట్లు ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఐదు రిటైల్ జోన్లను అభిషేక్‌రావు నడిపిస్తున్నట్లు పేర్కొంది. ఒబెరాయ్ హోటల్‌లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు విచారణలో సమీర్ మహేంద్రు చెప్పినట్లు ఈడీ చెప్పింది. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబులను ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో సమీర్ మహేంద్రు కలిసినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది. అనంతరం నలుగురు కలిసి శరత్ చంద్రారెడ్డికి చెందిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో ఎల్1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ వెల్లడించింది. ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశంలో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్ నాయర్ పాల్గొన్నట్లు సమీర్ మహేంద్రు ఛార్జిషీట్‌లో పేర్కొంది ఈడీ. ఇండో స్పిరిట్‌ను వెనుక నుంచి నడిపించింది ఎమ్మెల్సీ కవిత అని, ముందుండి నడిపింది రామచంద్ర పిళ్లై అని ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఇండో స్పిరిట్‌లో నిజమైన పార్టనర్స్ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూపు పేరిట 192 కోట్ల లిక్కర్ దందా చేసినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది.
నేటి నుంచే కేసీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ
తల్లీపిల్లల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటిని పంపిణీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు న్యూట్రిషన్ కిట్లను పంపిన సర్కారు.. నేడు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో గర్భిణీలకు కిట్ లను అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రక్తహీనత ఎక్కువగా నమోదవుతున్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్‌లలో బుధవారం కిట్ల పంపిణీ చేపట్టనుంది. ఆయా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేసీఆర్ పోష్టికాహార కిట్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గర్భిణీల కోసం రూపొందించిన ఒక్కో కిట్ విలువల 1962 రూపాయలు కాగా… ఒక్కో కిట్‌లో ఒక కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఒక కేజీ ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండజోల్ టాబ్లెట్, ఒక కప్పుని ప్లాస్టిక్ బాస్కెట్ లో పెట్టి అందించనున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ఫోర్బ్స్ ప్రశంసల వర్షం
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీద ప్రత్యేక వ్యాసాన్ని డిసెంబర్ సంచికలో ప్రచురించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్-బిల్డింగ్ బెటర్ టుమారో పేరిట ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించింది. మొక్కలు ఎంత ఎక్కువగా పెంచితే పర్యవరణం అంత రమణీయంగా ఉంటుందని, స్వచ్చమైన ఆక్సీజన్ తో పాటు పర్యావరణం కూడా పచ్చగా ఉంటూ ఉత్తేజాన్ని కలిగిస్తుందనే లక్ష్యంతో ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది ప్రముఖులు, కళాకారులు, క్రీడారంగ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతోష్ ఛాలెంజ్‌ను స్వీకరించి మరొకరికి ఇదే ఛాలెంజ్‌ని విసిరిన సందర్బాలు అనేకం ఉన్నాయి. ప్రముఖ నటుడు ప్రభాస్‌తో కలిసి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన నాటి ఫోటోను ఈ కథనంలో పొందుపరిచింది. “ఎవరైతే మొక్కను నాటుతారో వారు విశ్వాసాన్ని పాదుకొల్చుతున్నట్టు” అని అమెరికా- కవి లూసీ లార్కర్ 19వ శతాబ్దంలో చెప్పిన మాటతో వ్యాసాన్ని ప్రారంభించింది ఫోర్బ్స్. రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం లక్షల మందికి స్ఫూర్తినివ్వడమే కాకుండా హరిత యజ్ఞంలో లక్షల మందిని భాగస్వాములయ్యేలా చేసిందని ప్రశంసించింది. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు చెట్లు నాటడమే కాకుండా.. స్నేహితులు, సెలబ్రిటీలను, బంధువులను.. ఇలా సమాజం మొత్తాన్ని భాగస్వాములయ్యేలా చేసిందని పేర్కొంది.
టీనేజర్లే టార్గెట్.. వేధింపులు మామూలుగా ఉండవు..
యునైటెడ్ స్టేట్స్‌లో ఒక మహిళ తన సొంత కుమార్తెతో సహా టీనేజ్ విద్యార్థులను నకిలీ పేరు, నంబర్‌తో వేధింపులకు గురిచేసింది. ఇందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 42 ఏళ్ల కెన్రా గెయిల్ లికారీ అనే మహిళ తన సొంత కూతురిని, ఆమె బాయ్‌ప్రెండ్‌ని, క్లాస్‌మేట్స్‌ని వివిధ మెసేజ్‌లతో వేధింపులకు గురిచేసింది. ఆమె ఫేక్ ఐడింటిటీతో 2021 నుంచి ఆన్‌లైన్‌లో టీనేజర్లను ఇలా వేధించడం మొదలు పెట్టింది. వేధింపులు తాళలేక బీల్ సిటీ పబ్లిక్ స్కూల్స్ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును దర్యాప్తు చేసింది. విచిత్రమేమిటంటే సదరు మహిళ ఆ స్కూల్‌లోనే బాస్కెట్ బాల్ కోచ్‌గా పనిచేస్తోంది. ఇసాబెల్లా కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ డేవిడ్ బార్బెరి మాట్లాడుతూ, సందేశాలకు జోడించిన ఐసీ చిరునామాలను ఉపయోగించి మహిళను ట్రాక్ చేసినట్లు తెలిపారు. ఐతే విచారణలో సదరు మహిళ ఫేక్ ఐడింటిలతో టీనేజర్లను లక్ష్యంగా వేధించే సందేశాలను పంపినట్లు పోలీసులు గుర్తించారు. తనను గుర్తుపట్టకుండా ఉండేలా సాఫ్ట్‌వేర్‌ను, వివిద ప్రాంతాల నెంబర్లను, కోడ్‌లను వినియోగించినట్లు తేలింది. సైబర్ పోలీసులు ఆమెను ఐపీ అడ్రస్ సాయంతో ఆమెను ట్రాక్ చేశారు. ఆమె తన కూతురికి లేదా ఆమె క్లాస్‌మేట్‌లకి పంపించిన సుమారు పదివేల టెక్స్ట్ మెసేజ్‌లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళపై ఐదు ఆరోపణలు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరపరిచారు. దీంతో ఆమె సైబర్ వేధింపులకు పాల్పడినందుకుగానూ పదేళ్ల పాటు జైలు శిక్ష, నేరాలను మార్పు చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఐదేళ్లు జైలు శిక్ష ఎదుర్కొటోంది. ఐతే ఆమె ప్రస్తుతం తాజాగా సుమారు రూ.నాలుగు లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యింది.
వేల మందిని చంపేసింది..!
రెండో వరల్డ్ వార్ టైంలో ఏకంగా వేల మందిని చంపిన కేసులో 97ఏళ్ల వృద్ధురాలికి కోర్టు శిక్షవిధించింది. నాజీ నిర్బంధ శిబిరం కార్యదర్శిగా పనిచేసిన మహిళ వేల మందిని హత్య చేయడంలో ఆమె పాత్ర ఉందని భావించిన కోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది. ఆ సమయంలో ఆమె అక్కడ నిర్బంధంలో ఉన్న యుద్ధ ఖైదీలు సుమారు 10,500 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఐతే ఆ హత్యల్లో ఈ వృద్ధురాలు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు జర్మనీలో ఇట్జెహులో జిల్లా కోర్డు మంగళవారం పేర్కోంది. ఇంతమంది మరణానికి సహకరించినందుకుగానూ ఇట్జెహోలోని జిల్లా కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. ఆ కేసులో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష తోపాటు ఆమె ఈ హత్యలు చేసినప్పుడూ వయసు 18 నుంచి 19ఏళ్ల వయసు ఉండడంతో అప్పటి బాల నేరస్తుల చట్టం ప్రకారం విధించే శిక్షలను కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఆమెపై దాదాపు 11,412 మంది హత్యలకు సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఐతే 2021 నుంచి కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. అదీగాక ఆమె కూడా అనారోగ్యం బారిన పడడంతో కోర్టుకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ వృద్ధురాలు 1943 నుంచి 1945 కాలంలో స్టట్‌థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో పనిచేసింది. అక్కడ నిర్బంధంలో ఉన్న దాదాపు 65 వేల మంది ఆకలితో లేదా వ్యాధులతో మరణించారు. మరికొంతమంది స్టట్‌థాప్‌లోని గ్యాస్ చాంబర్‌లో మరణించారు. వారంతా నాజీల నిర్మూలన ప్రచారంలో పాల్గొన్న యుద్ధ ఖైదీలు, వారిలో కొందరూ యూదులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే ఇది రెండో ప్రపంచ యుద్ధ నేరాలకు సంబంధించిన చివరి కేసు విచారణ అని జర్మనీ స్థానిక మీడియా పేర్కొంది.
నేడు తమన్నా బర్త్‌డే
అందరినీ అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించారు. మనెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్ లో చదివిన తమన్నాచిన్నతనం నుంచీ ‘షో బిజ్’పై మనసు పారేసుకుంది. అందుకు ఆమె కన్నవారు సంతోష్ భాటియా, రజనీ సైతం సహకరించారు. తమన్నా చదివే పాఠశాల వార్షికోత్సవంలో ఆమె చేసిన ప్రోగ్రామ్ అందరినీ అలరించింది. ముంబై సినిమా జనాల్లో కొందరు తమన్నాకు తమ చిత్రాల్లో అవకాశాలూ ఇస్తామన్నారు. అప్పుడు తమన్నా వయసు కేవలం 13 సంవత్సరాలే! అనుభవం కోసం ముంబై లోని పృథ్వీ థియేటర్ లో ఏడాది పాటు నాటకాల్లో నటించింది. తరువాత కొన్ని ఆల్బమ్స్ లోనూ తళుక్కుమంది. పదిహేనేళ్ళ వయసులో ‘చాంద్ స రోషన్ చెహ్రా’ సినిమాతో తమన్నా నాయికగా పరిచయం అయ్యారు. ఆ పై మంచు మనోజ్ హీరోగా రూపొందిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారామె. తరువాత ‘కేడీ’ అనే తమిళ సినిమాలో నటించారు. ఇలా ఆరంభంలోనే వరుసగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన తమన్నాకు ఆ పై ఆ సినిమా రంగాల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’తోనే తమన్నా నటజీవితంలో హ్యాపీ డేస్ మొదలయ్యాయని చెప్పాలి. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మధ్య మధ్యలో అవకాశం లభిస్తే హిందీలోనూ నటిస్తూ తమన్నా సక్సెస్ చవిచూశారు.
‘కింగ్’ ఖాన్ షారూఖ్
ఎంపైర్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో డెంజల్ వాషింగ్టన్, మార్లోన్ బ్రాండో, టామ్ హాంక్స్, కేట్ విన్స్‌లెట్ వంటి వారు ముందున్నారు. భారతదేశం నుండి వీరిలో చేరిన ఏకైక నటుడు షారుఖ్. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారూక్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఓ సినిమాలో అతడు చెప్పి ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్ గురించి చెబుతూ.. అతడి కెరియర్‌లోనే ఈ డైలాగ్ ఉత్తమమైనదని కొనియాడింది. షారూఖ్ కెరీర్‌లో కొన్ని ముఖ్యమైన పాత్రలను ఉటంకిస్తూ అతడి పేరు ఈ జాబితాలో చేరింది. ఇందులో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై నుండి రాహుల్ ఖన్నా, సంజయ్ లీలా భన్సాలీ యొక్క దేవదాస్ నుండి దేవదాస్ ముఖర్జీ, అశుతోష్ గోవారికర్ యొక్క స్వదేస్ నుండి మోహన్ భార్గవ మరియు కరణ్ జోహార్ యొక్క మై నేమ్ ఈజ్ ఖాన్ నుండి రిజ్వాన్ ఖాన్ పాత్రలున్నాయి. ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారూక్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.