మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకుని పోలింగ్ బూత్‌లకు తరలి వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక హెలికాప్టర్లలో సిబ్బందిని తరలిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
ఇదిలా ఉంటే ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. సెలబ్రిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బుధవారం అన్ని సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు తరలి రావాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఆయా ప్రాంతాల్లో ఉంటున్న మహారాష్ట్ర వాసులంతా ఓటు వేసేందుకు స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు, సొంత వాహనాలు కిక్కిరిసి వెళ్తున్నాయి. మరోవైపు ఇండియన్ రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మొత్తం దారులన్నీ మహారాష్ట్ర, జార్ఖండ్ వైపే వెళ్తున్నాయి.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం ఒక్కరోజే ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక జార్ఖండ్‌లో అయితే రెండు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడత నవంబర్ 13న 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా స్థానాలకు బుధవరం జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇక ఎగ్జిట్స్ పోల్స్ మాత్రం ఓటింగ్ ముగిసిన తర్వాత వెలువడనున్నాయి.