Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం ముదిరింది. మమతా బెనర్జీకి రోజుకో షాక్ ఎదురవుతోంది. మమతా బెనర్జీకి నమ్మినబంటులుగా, వీర విధేయులుగా ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో టీఎంసీ తరుపున గెలిచిన 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలలో 8 మంది ఇప్పుడు తిరుగుబాటు వర్గమైన రీటబ్రత బెనర్జీ క్యాంపులో ఉన్నారు. దీనిని బట్టి చూస్తే టీఎంసీకి సంప్రదాయంగా ఓటు బ్యాంక్‌గా ఉన్న ముస్లింలు కూడా ఆమె దూరమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మమతా బెనర్జీకి విధేయుడు, పార్టీ సీనియర్ నేత జావేద్ ఖాన్‌తో పాటు మరో కీలక నేత కాజల్ షేక్ వంటి ప్రముఖులు కూడా రెబల్ ఎమ్మెల్యేల గ్రూపులో ఉండటం గమనార్హం. రీటబ్రత వర్గంలో చేరిన జావేద్ ఖాన్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా నియమించారు. మరో నేత అఖ్రుజ్జమాన్‌ను చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించారు. మమతా బెనర్జీ గత మంత్రి వర్గంలో ఉన్న జావేద్ ఖాన్, సబీనా యాస్మిన్, గులాం రబ్బానీ, అఖ్రుజ్జమాన్ వంటి మైనారిటీ నేతలు ఇప్పుడు తిరుగుబాటు శిబిరంలో చేరినట్లు సమాచారం. టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇందులో 34 మంది ముస్లిం ఎమ్మెల్యేలు. ఇప్పుడు వీరిలో 17 మంది తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
