TMC leader arrested by CBI: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ కీలక నేత, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అరెస్ట్ చేసింది. గురువారం బీర్భూమ్ లోని అతని నివాసంలో సీబీఐ అనుబ్రతా మోండల్ ను అదుపులోకి తీసుకుంది. పశువుల అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్ట్ చేసింది. 2020లో సీబీఐ పశువుల అక్రమ రవాణా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుబ్రతా మోండల్ ఉన్నారు. 2015, 2017 మధ్య దాదాపుగా 20,000 వేలకు పైగా పశువులను అక్రమంగా సరిహద్దు దాటించారు. ఈ కేసులో భాగంగా అనుబ్రతా మోండల్ బాడీ గార్డ్ సైగల్ హుస్సేన్ ని సీబీఐ ప్రశ్నించింది.
గతంలో సీబీఐ అనుబ్రతా మోండల్ కు 10 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేవలం రెండు సార్లు మాత్రమే ఆయన సీబీఐ ముందు హాజరు అయ్యారు. ఆరోగ్య సమస్యలని చెబుతూ.. విచారణను దాటవేశారు. దీంతో సీబీఐ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత పార్థ ఛటర్జీ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో అడ్డంగా బుక్కయ్యాడు. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 20 కోట్లకు పైగా నగదు బయటపడటం దేశ వ్యాప్తంగా సంచలన కలిగించింది. ఈ కేసులో తరువాత మరో త్రుణమూల్ కాంగ్రెస్ నేతను కేంద్ర సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో సీఎం మమతా బెనర్జీకి వరసగా షాకులు తగులుతున్నాయి.
Read Also: Actress Tabu: షూటింగ్‌లో గాయం.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం
అనుబ్రతా మోండల్ బాడీగార్డ్ సైగల్ హుస్సేన్ పేరిట భారీ ఆస్తులు ఉన్నాయి. అయితే విచారణలో వీటిపై సరైన సమాధాలు ఇవ్వలేదని సీబీఐ పేర్కొంది. ముర్షిదాబాద్ తో పాటు కోల్ కతాలో పలు ఫ్లాట్లను కలిగి ఉన్నాడు. ఓ కానిస్టేబుల్ వ్యక్తి ఇంత మేర ఆస్తులు ఎలా సంపాదించాడనే వివరాలను రాబడుతోంది సీబీఐ. అనుబ్రతా మోండల్ అరెస్ట్ పై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ, అనుబ్రతా మోండల్ వంటి నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని బీజేపీ విమర్శిస్తోంది.