Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బస్తర్ ఏరియా, నక్సలిజానికి కంచుకోట. ఇప్పటికీ దేశంలో మావోయిస్టులు చాలా యాక్టివ్‌గా ఉన్న ప్రాంతం. నిత్యం ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ పోరులో అనేక గిరిజన పల్లెలు గత కొన్ని దశాబ్ధాలుగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అక్కడి గిరిజన గూడేల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే అనుమానపు చూపులే. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా కూడా, ఛత్తీస్‌గఢ్ అటవీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ పట్టు పూర్తిగా లేదని చెప్పొచ్చు.
అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రభుత్వం దృఢంగా వ్యవహరించి, మావోయిస్టులను నిర్మూలించే చివరి దశకు చేరుకున్నారు. భద్రతా బలగాల సాయంతో బస్తర్ గ్రామాలు ఇప్పుడు నక్సల్స్ భయాన్ని అధిగమించారు. బీజాపూర్, సుకుమా వంటి జిల్లాల్లో గిరిజన గ్రామాలు స్వేచ్ఛని అనుభవిస్తున్నాయి. సుక్మా జిల్లాలోని మండలాల్లో 16 పోలీస్ శిభిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తముల్పాడ్ ఒకటి. ఈ గ్రామంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్ ఈ వేడుకలు నాయకత్వం వహించింది. పిల్లలు, వృద్ధులతో సహా గ్రామస్తులు ‘‘భారత్ మాతా కీ జై’’ వంటి నినాదాలు చేస్తూ, స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. నక్సల్స్ భయం వల్ల తుముల్పాడ్ వంటి గ్రామాల్లోని ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకుండా ఉన్నారు. అయితే, ఈ ప్రాంతాల్లో కొత్త పోలీస్ శిబిరాల ఏర్పాటుతో ఇక్కడి ప్రజలు ప్రభుత్వంతో మేమేకం అవుతున్నారు. సుక్మాలోని చింతల్నార్, పూవర్తి వంటి అంత్యం ప్రభావిత మండలాల్లో 16కి పైగా పోలీస్ శిబిరాలను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకలు వీరి ఆధ్వర్యంలో జరిగాయి.