‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా వల్లే జమ్మూ కాశ్మీర్ లో హిందువుల హత్యలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీహర్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ. కాశ్మీరీ హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరగడానికి కారణం ఈ సినిమానే అని అన్నారు. సినిమా మేకర్స్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని.. కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ మినహాయింపు ఇచ్చిందని.. పలువురు కాబినెట్ మంత్రులు, శాసన సభ్యులు సినిమాను థియేటర్ కు వెళ్లి చూశారని.. సినిమా తీయడం మిలిటెంట్ల కుట్రలో భాగం అని నేను అప్పట్లోనే చెప్పానని మాంఝీ అన్నారు.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీయడం కాశ్మీరీ బ్రహ్మణులలో భయాన్ని సృష్టించడం అని ఫలితంగా వారు లోయలోకి వెళ్లకుండా చేయడం అని ఆరోపించారు. లోయలో నివసిస్తున్న హిందువులు కూడా వెళ్లిపోవడమో లేకపోతే పరిస్థితులును ఎదుర్కోవడమో చేస్తున్నారని అన్నారు. బీహరీ కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు.కాశ్మీర్ లో శాంతి భద్రతలను కాపాడాలంటే బీహారీ ప్రజలకు కాశ్మీర్ ను అప్పగించండి.. వెంటనే మేం శాంతిని పునరుద్ధరిస్తాం అని అన్నారు.
గురువారం కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో ఇటుకబట్టిలో పనిచేస్తున్న ఇద్దరు బీహర్ కూలీలను టెర్రరిస్టులు హతమార్చారు. ఈ ఘటనకు ముందు గురువారం ఉదయం కాశ్మీర్ కుల్గామ్ లో బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న రాజస్థాన్ కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని చంపేశారు. ఈ ఘటనలకు కన్నా ముందుగా రాహుల్ భట్ అనే కాశ్మీర్ పండిట్ ను, ఇటీవల కాలంలో టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, హిందు మహిళా ఉపాధ్యాయురాలిని టెర్రరిస్టులు హతమార్చారు. ఈ ఘటనపై ఈరోజు హోం మంత్రి అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ జరిగింది.