Universal Pension Scheme: భారతీయులందరి కోసం కేంద్ర కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసంఘటి రంగంలోని వారితో సహా అందరు పౌరులకు అందుబాటులో ఉండేలా ‘‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’’పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్మాణ కార్మికులు, గృహ సిబ్బంది, గిగ్ వర్కర్లు వంటి అసంఘటిత రంగంలోని వారికి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలు అందుబాటులో లేవు.
ఈ పథకం జీతాలు పొందే అందరు ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి అందుబాటులో ఉంటుంది. అయితే, కొత్త ప్రతిపాదనకు, ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్( ఈపీఎఫ్ఓ) వంటి ప్రస్తుత పథకాలకు మధ్య కీలక వ్యత్యాసం ఏంటంటే, మునుపటి వాటికి కాంట్రిబ్యూషన్ స్వచ్ఛంద ప్రాతిపదికన ఉంటుంది, ప్రభుత్వం తన వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందించదు.
Read Also: Mahua Maji: కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. జేఎంఎం ఎంపీకి తీవ్రగాయాలు
యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అందించడం అనేది సాధారణ ఆలోచన అని విషయం తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. దీని అర్థం దేశంలో పెన్షన్/పొదుపు పథకాలను క్రమబద్ధీకరించడం అనేది ఇప్పటికే ఉన్న కొన్ని పథకాలను కలిపి ఉంచడం ద్వారా సాధ్యమవుతుంది. స్వచ్ఛంద ప్రాతిపదికన ఏ పౌరుడైనా వీటిని ఎంచుకోవచ్చని సోర్సెస్ చెబుతున్నాయి. ప్రస్తుతానికి ‘‘న్యూ పెన్షన్ స్కీమ్’’గా పిలువబడుతున్న ఈ కొత్త పథకం, స్వచ్ఛంద పెన్షన్ పథకం అయిన జాతీయ పెన్షన్ పథకాన్ని భర్తీ చేయడం కానీ, విలీనం చేయదని విషయం తెలిసిన వారు చెబుతున్నారు.
ప్రస్తుతం అసంఘటిత రంగానికి ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను నిర్వహిస్తోంది. వాటిలో పెట్టుబడిదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 1000-1500 రాబడిని అందించే అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారులు, డొమెస్టిక్ వర్కర్లు లేదా కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన(PM-SYM) వంటివి ఉన్నాయి. రైతుల కోసం రూపొందించిన పథకాలు కూడా ఉన్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజన వంటివి, పెట్టుబడిదారుడు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 అందిస్తుంది.