భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసింది. కొన్ని గ్రామాలకు, పట్టణాలకు మిగితా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వర్షాలతో పెళ్లి కార్యక్రమాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి ఘటనే ఇది.. కేరళలోని తలవడి గ్రామానికి చెందిన ఆకాష్, ఐశ్వర్యలు ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. అయితే వీరికి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం అయ్యింది. ఈ నెల 18న వీరికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో నూతన వధూవరులను పెద్ద పాత్రలో కూర్చోబెట్టి వరదనీటిలోనే తలవడిలోని ఓ గుడికి తీసుకెళ్లారు. ఆ గుడిలోనే పెళ్లి తంతు ముగించుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవడంతో.. ‘మా పెళ్లి ఇలా జరుగుతుందనుకోలేదు‘ అని పెళ్లి కూతురు ఐశ్వర్య స్థానిక మీడియాతో అన్నారు. అంతేకాకుండా వరుడు ఆకాష్ మాట్లాడుతూ.. మా పెళ్లి చాలా రోజుల క్రితమే నిశ్చయమైందని, అందుకే తేదీని వాయిదా వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.