Suryakanta Patil: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరిచిన బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి సూర్యకాంత పాటిల్ కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో తానను చాలా నేర్చుకున్నానని, ఇందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె రాజీనామా తర్వాత అన్నారు. 2014లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరారు. సూర్యకాంత పాటిల్ హింగోలి-నాందేడ్ నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమె గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
Read Also: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె మరఠ్వాడాలోని హింగోలి నియోజకవర్గం నుంచి పార్టీ తరుపున పోటీ చేయాలని భావించారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దక్కింది. దీంతో ఆమెకు టికెట్ లభించలేదు. తాను పోటీలో లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఆమెకు హద్గావ్ హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పోల్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థి చేతిలో శివసేన అభ్యర్థి ఈ సీటు నుంచి ఓడిపోయారు.
లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 48 ఎంపీ సీట్లలో ఎన్డీయే కూటమి 18 స్థానాల్లోనే గెలిచింది. ఇందులో బీజేపీ -10, ఏక్నాథ్ షిండే శివసేన-07, అజిత్ పవార్ ఎన్సీపీ-01 సీట్లను గెలుచుకుంది. ఇండియా కూటమి మొత్తం 29 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్-13, ఉద్ధవ్ ఠాక్రే శివసేన-09, అజిత్ పవార్ ఎన్సీపీ-07 సీట్లను గెలుచుకుంది.