Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కోర్టు ఆయనకు రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకి తరలించారు. కేజ్రీవాల్‌ని జైల్ నెంబర్ 2లో ఉంచారు. ఇక్కడే అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా మరియు ఉగ్రవాది జియావుర్ రెహ్మాన్ ఉన్నారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి ముందు సన్నిహితుడిగా ఉండీ, ఆ తర్వాత ప్రత్యర్థిగా మారిన ఛోటారాజన్ తీహార్ జైలులోనే ఉన్నాడు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాపై 40కి పైగా హత్యలు, హత్యాయత్నం, దోపిడి కేసులు ఉన్నాయి. ఇక జియావుర్ రెహ్మాన్ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీర్ కీలక ఉగ్రవాది. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు నెంబర్ 1లో ఉండగా.. బీఆర్ఎస్ నాయకురాలు కవిత మహిళా విభాగం జైలు నెంబర్ 6లో ఉన్నారు.
Read Also: Atishi: లోక్‌సభ ఎన్నికల ముందు మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్..
సోమవారం సాయంత్రం 4 గంటలకు తీహార్ జైలుకు తీసుకొచ్చారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్‌కి రాత్రి ఇంట్లో వండిన ఆహారాన్ని అందించారు. మంగళవారం ఉదయం 6.40 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ అందించారు. బ్రెడ్, టీని అందించినట్లు జైలు వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ గంటకు పైగా తన సెల్‌లో ధ్యానం, యోగా చేశారు. సీఎం సెల్‌లో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి 24×7 నిఘా ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్ షుగర్ లెవెల్ సాధారణ స్థితికి వచ్చే వరకు ఇంట్లో వండిన భోజనం, రాత్రి భోజనం చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రతీ రోజు 5 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడేందుకు కేజ్రీవాల్‌కి అనుమతి ఇచ్చారు.