Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైనప్పటి నుంచి ఆప్ నేతలు బీజేపీ టార్గెట్‌గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మంత్రి అతిషీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని ఆ పార్టీ తనను సంప్రదించినట్లుగా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలని, దాని నాయకులందర్ని అంతమొందించాలని ప్రధాన మంత్రి, బీజేపీ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్ నేతలు- నన్ను, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా మరియు దుర్గేష్ పాఠక్‌లను బీజేపీ అరెస్ట్ చేయాలని భావిస్తోందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘మొదట వారు ఆప్ నాయకత్వంలోని ప్రతీ ఒక్కరిని జైల్లో పెట్టారు. సత్యేంద్ర జైన్, మనీస్ సిసోడియా, సంజయ్ సింగ్ ఇప్పుడు సీఎం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. మరో రెండు నెలల్లో మరో నలుగురు ఆప్ నాయకులను అరెస్ట్ చేయాలన్నది బీజేపీ ప్లాన్’’ అని అతిషీ ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీ చీలిపోతుందని బీజేపీ భావించిందని, అయితే రాంలీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీ తర్వాత నలుగురు నేతల అరెస్టులు సరిపోవని బీజేపీ భావిస్తోందని ఆమె ఆరోపించారు. రానున్న రోజుల్లో తనపై, తన బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు చేయవచ్చని తమకు సమాచారం ఉందని ఆమె అన్నారు. తామంతా కేజ్రీవాల్ సైనికులం, బీజేపీ బెదిరింపులకు భయపడమని చెప్పారు.
Read Also: Tillu Square collections: బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న టిల్లు గాడు.. ఎన్ని కోట్లంటే?
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అతీషి, సౌరభ్ భరద్వాజ్‌లను ప్రశ్నించాలని ఈడీ పేర్కొన్న ఒక రోజు తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ విజయ్ నాయర్‌తో అతిషీ మర్లేనా, సౌరభ్ భరద్వాజ్‌ల సంబంధాలపై తమకు కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ చెబుతోంది. ఈడీ, సీబీఐ చార్జీషీట్లలో ఇప్పటికే ఈ సమాచారం ఉందని, ఈడీ మా పేర్లను తీసుకునే అవకాశం ఉందని, తద్వారా ఆప్ ద్వితీయ శ్రేణిని అరెస్ట్ చేయడాన్ని కొనసాగిస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, ఆప్ చేస్తున్న ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. ఇది నిరాధారమైన ఆరోపణలని చెప్పింది. బీజేపీ నేత ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. నేను కూడా ఆప్ గురించి చాలా విషయాలు చెప్పగలనని, అది వారి అంతర్గత వ్యవహారమని అన్నారు. ఆప్‌లో సీఎం పదవి కోసం పోరు మొదలైందని అన్నారు. ఓ వైపు సౌరభ్ భరద్వాజ్, అతిషీ ఉండగా.. మరోవైపు సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని ఆయన ఆరోపించారు.