కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇవాళ స్కూల్స్, కాలేజీలకు బంద్ ప్రకటించారు. మరోవైపు.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Read Also: Train Tickets: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఎన్నో ప్రయోజనాలు..
శివమొగ్గ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. హర్ష హత్యకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని స్పష్టం చేశారు. హంతకులకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.మరోవైపు కర్ణాటక మంత్రి నారాయణ గౌడ.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్యను… రాజకీయం చేయడం మంచిది కాదన్నారు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. నిందితులను గుర్తించి… కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఈశ్వరప్పకు పిచ్చి పట్టిందని… అందుకే పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య దారుణమన్నారు మాజీ సీఎం కుమారస్వామి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కావాల్సింది ఇలాంటి ఘటనలేనని…వారిప్పుడు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసును ఎన్‌ఐఏతో విచారణ చేయించాలని కేంద్రమంత్రి శోభా.. సీఎం బొమ్మైకు లేఖ రాశారు. మరోవైపు.. తమ కుటుంబసభ్యుడు హర్షను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఇక, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ, కాషాయ కండువాలు ధరించిన వ్యక్తుల గుంపు రాళ్లు రువ్వడం మరియు పోలీసు వాహనానికి నిప్పంటించడంతో శివమొగ్గ హింసాత్మకంగా మారింది. మరోవైపు, ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. వారి ఇంటరాగేషన్ జరుగుతోంది కాబట్టి వారి నేపథ్యంపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనన్నారు మంత్రి జ్ఞానేంద్ర.. వారి పాత్రను నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.