తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన చందంగా మారుతోంది. నేడు ఆస్తుల లెక్కపై దీక్షితుల వైఖరి పై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు దేవాదాయ శాఖ.
తాజాగా అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అధీనాధిపతులు, దీక్షితులు. అన్ని ప్రధాన దేవాలయాల నిర్వహణను నియంత్రిస్తున్న తమిళనాడు హిందూ మత..ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్ అండ్ సిఇ) శాఖ చిదంబరం నటరాజ ఆలయానికి చెందిన వారి ఖాతాలు, ఆస్తుల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపడం వివాదానికి కారణం అవుతోంది.
దేవాలయానికి చెందిన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాలని దీక్షితులు వర్గానికి తమిళనాడు రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం మరింత వివాదాన్ని పెంచింది. ఆలయ ఆస్తులువివరాలను జూన్ 7 , 8 తేదీల్లో తెలిపాలని నోటీసుల్లో పేర్కొంది. ఆలయంలోని కనగసభలో దర్శనం పునఃప్రారంభించాలంటూ హెచ్‌ఆర్ అండ్ సీఈ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై దీక్షితులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ద్రావిడన్ మోడల్ పాలన మాకు అక్కరలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న చిదంబరం నటరాజ.స్వామి ఆలయంలో దీక్షితులతో దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు భేటీ అయ్యారు. ఆస్తుల లెక్క తేల్చడంలో తగ్గేది లేదన్న మంత్రి వైఖరిపై మండిపడుతున్నారు. అధీనాధిపతులు, దీక్షితులతో చర్చిస్తున్నామని, కొందరు కావాలనే వివాదం చేస్తున్నారన్నారు మంత్రి. నాస్తికులు, ఆస్తికులు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్లాలన్నారు శేఖర్ బాబు. చిదంబరం ఆలయానికి దేవాదాయ శాఖ అధికారులు వెళ్ళనుండడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ఆలయ సంపద విషయంలో ప్రభుత్వంతో ఎలాంటి పోరాటానికైనా తాము రెడీగా ఉన్నామని దీక్షితుల వర్గం పేర్కొంది.