నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్ లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఐదో రోజైన బుధవారం.. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సేవాకాలం నివేదన, మంగళాశాసనాలు, శాత్తుమోరై, వేద విన్నపాలు, ద్వారా తోరణ ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం మూలమంత్రమూర్తి మంత్రహవనం, పంచసూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్యపూర్ణాహుతి, నివేదన, మంగళాశాసనములు, వేద విన్నపాలు, శాత్తుమోరై, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సాయంత్రం 6 నుంచి 9.30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం, మూల మంత్రమూర్తి, మంత్ర హవనములు, ప్రతిష్ఠా విగ్రహాలకు ఫల పుష్ప శయ్యాధివాసము, తత్వ వ్యాస హవనము, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనము, నిత్య పూర్ణాహుతి, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తుమోరై, తీర్థప్రసాద గోష్టి నిర్వహించనున్నారు.
జూన్ 4న వైభవంగా నూతన ఆలయ ప్రారంభోత్సవ క్రతువులో తొలిరోజు దాదాపు 15 వేలకుపైగా భక్త జనం ప్రత్యక్షంగా తిలకించారు. అయితే ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. సీహెచ్ కొండూర్ ఒకప్పుడు గోదావరి నదికి ఆనుకొని ఉన్న కుగ్రామం. దశాబ్దాల క్రితమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా ముంపు బారిన పడింది. దీంతో వందల కుటుంబాలు అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం తరలివెళ్లి, సీహెచ్ కొండూర్ పేరుతోనే స్థిరపడ్డాయి. నాడు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలంతా కొంగుబంగారంగా కొలిచే శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సైతం ముంపుబారిన పడింది. దీంతో లక్ష్మీనరసింహుడి విగ్రహాలను సైతం తమ వెంటే నూతన గ్రామానికి తీసుకొచ్చారు. చిన్నపాటి గూడు ఏర్పాటు చేసి, ఐదున్నర దశాబ్దాలుగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Prakash Goud: దళిత బంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు