Telangana Vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. కేంద్ర సాంస్కృతిక, కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోం శాఖ పరిధిలో సాయుధ దళాలతో పెరేడ్ నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారులతో కిషన్ రెడ్డి ఈ మేరకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏడాది పాటు అమృతోత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్ణయం తీసుకుంది. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో కేంద్రం వియోచన కార్యక్రమాలను జరుపనుంది.
Read Also: Brahmastra: బ్రహ్మాస్త్ర రాజకీయం.. ఎన్టీఆర్ తో బీజేపీ భేటీనే కారణం..?
ఈ కార్యక్రమాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేలు కూడా హాజరవ్వనున్నారు. గతంలో నిజాం స్టేట్ లో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో వియోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా చేయడం లేదని బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తోంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. నిజాం నుంచి తెలంగాణ విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటుంది. రేపు జరిగే కేబినెట్, ఎల్పీ సమావేశాల్లో దీనిపై చర్చించనున్నారు.