Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. లాలూ కుటుంబంలో తీవ్ర విభేదాలు ముసురుకున్నాయి. తాజాగా, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, తన తమ్ముడు తేజస్వీ యాదవ్ , తన అక్క మీసా భారతిలను ఎక్స్‌లో అన్‌ఫాలో చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఈ చర్య కుటుంబంలో చీలిక గురించి కొత్త ఊహాగానాలకు దారి తీసింది.
Read Also: Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ కూల్చివేత ? ప్రపంచ వింత మాయం కానుందా!
ఆర్జేడీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్తగా జనశక్తి జనతాదళ్ (జెజెడి) పార్టీని ప్రారంభించారు. అక్టోబర్ 13న తన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం, తేజ్ ప్రతాప్ తండ్రి లాలూ, తల్లి రబ్రీదేవీ, చెల్లెలు రాజ్ లక్ష్మీ యాదవ్‌లను మాత్రమే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. మరో సోదరి హేమా యాదవ్‌ను అంతకుముందు అన్‌ఫాలో చేశారు. కుటుంబ విభేదాలు ఇప్పుడు లాలూ కుటుంబంలో రాజకీయ వివాదాలుగా మారాయి. కొడుకు కొత్త పార్టీ పెట్టడం ఆర్జేడీలో చాలా మందికి నచ్చడం లేదు. తేజ్ ప్రతాప్ వచ్చే ఎన్నికల్లో మహువా నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి, నవంబర్ 14న లెక్కింపు జరుగుతుంది.
ఇటీవల ఫేస్ బుక్ వేదికగా తను ఓ అమ్మాయితో ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నానని ప్రకటించడం మొత్తం వివాదానికి కారణమైంది. ఇదే కుటుంబంలో చిచ్చుపెట్టింది. క్రమశిక్షణా చర్యల కింద లాలూ, తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. తేజ్ ప్రతాప్‌కు గతంలో మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ తో వివాహమైంది, ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.
