Site icon NTV Telugu

Tej Pratap Yadav: ఆర్జేడీకి భారీ షాక్.. లాలూ కుమారుడి కొత్త పార్టీ..

Tej Pratap Yadav

Tej Pratap Yadav

Tej Pratap Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also: India Russia: ‘‘యుద్ధంపై మోడీ, పుతిన్ చర్చించారు..’’ నాటో చీఫ్ వ్యాఖ్యలను తిరస్కరించిన భారత్..

పార్టీ పోస్టర్‌పై మహత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, రారామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. దానిపై “సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, మార్పు ” అనే నినాదాలు ఉన్నాయి. పార్టీని ప్రకటించిన తర్వాత, తేజ్ ప్రతాప్ యాదవ్ సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేశారు. తాము బీహార్ పూర్తి అభివృద్ధి కోసం, కొత్త వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బీహార్ అభివృద్ధి కోసం సుదీర్ఘ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను ఎన్నికల్లో వైశాలి జిల్లా మహువా స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

మే 25న తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ పార్టీ నుంచి బహిష్కరిస్తూ తండ్రి లాలూ నిర్ణయం తీసుకున్నారు. అనుష్క అనే మహిళతో సంబంధం ఉందని తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. దీని తర్వాత తన సోషల్ మీడియా పేజీ హ్యక్ అయిందని చెప్పాడు. అయినప్పటికీ, కొడుకు బాధ్యతరహితంగా ప్రవర్తించాడనే కారణంగా లాలూ అతడిని పార్టీ నుంచి తొలగించారు.

Exit mobile version