Tamil Nadu: తమిళ కవి తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళులు అర్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బుధవారం చెన్నైలోని రాజ్ భవన్ ప్రాంగణంలో తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోలో తిరువళ్లువర్‌కి ‘‘కాషాయ’’ వస్త్రధారణ, రుద్రాక్ష పూసలు ఉండటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యతరం తెలిపింది. బూడిద, కుంకుమ వంటి మతపరమైన గుర్తులు ఉండటాన్ని తప్పుపట్టింది. ఇలాంటి చిత్రీకరణ ఆమోదయోగ్యం కాదని తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ కే. సెల్వపెరుంతగై అన్నారు.
Read Also: Israel-Hamas: కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ!
ప్రభుత్వం గుర్తించిన తిరువళ్లువర్ చిత్రపటాన్ని గవర్నర్ పాటించలేదని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ఆయన సాధువు-కవి అలాంటి వ్యక్తికి మతపరమైన అర్థాలు ఇస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న గవర్నర్ ఇలా చేయడాన్ని ఖండిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వాన్నే కాకుండా, తమిళజాతిని, తిరువళ్లువర్‌ని కూడా అవమానించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
తమిళ మాసం థాయ్ రెండవ రోజున తిరువళ్లవర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.తమిళ సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన ‘‘తిరుక్కురల్’’ని రాసిన కవి తిరువళ్లువర్. నీతి, పాలన, వ్యక్తిగత ప్రవర్తనలకు ఈ గ్రంథం మార్గదర్శిగా ఉంది. సామాజిక విలువలు, పాలనను రూపొందించడంలో తిరువల్లువర్ ఎనలేని కృషి చేశారని గవర్నర్ రవి ప్రశంసించారు. తమిళ పోషకుడు తిరువళ్లువర్‌ని ఈ దేశం ప్రగాఢ కృతజ్ఞతతో, అత్యంత భక్తితో స్మరించుకుంటుందని, అనేక వేల సంవత్సరాల క్రితం ఆయన మనకు తిరుక్కురల్ అనే అసమానమైన జ్ఞానాన్ని ప్రసాదించారుని రాజ్ భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి ముందు ప్రధాని నరేంద్రమోడీ తమిళ కవికి నివాళులు అర్పించారు.