K Annamalai: బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల ముందు ఉన్న పెరియార్ విగ్రహాలను తొలగిస్తామని ప్రకటించారు. శ్రీరంగంలో జరిగిన ర్యాలీలో అన్నామలై ఈ ప్రకటన చేశారు. 1967లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల ముందు శిలాఫలకాలు ఏర్పాటు చేసి..‘‘ దేవుళ్లను అనుసరించే వారు మూర్ఖులు.. దేవున్ని నమ్మే వారు మోసగించబడుతారు. కాబట్టి దేవున్ని పూజించకండి’’ ప్రచారం చేశారని, అంతకుముందు ఈ బోర్డులు ఆలయాల ముందు లేవని అన్నారు.
‘‘ఈ రోజు శ్రీరంగం నేల నుంచి బీజేపీ మీకు హామీ ఇస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, మా మొదటి పని అటువంటి ధ్వజస్తంభాలను పెకిలించి, దీనికి బదులు మేము మా అళ్వార్లు, నాయనార్ల విగ్రహాలు ప్రతిష్టిస్తాము. తమిళ గురువు తిరువళ్లువర్ విగ్రహాన్ని ఉంచుతాము, మన స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను కూడా గౌరవిస్తాం’’ అని అన్నామలై అన్నారు.
Read Also: Laughing Gas: ‘లాఫింగ్ గ్యాస్’పై యూకే నిషేధం.. కారణమిదే..
అన్నామలై బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ మత, ధర్మదాయశాఖ మంత్రిత్వశాఖను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మంత్రిత్వ శాఖ చివరి రోజు బీజేపీ ప్రభుత్వ మొదటి రోజు అని ప్రకటించారు. పెరియార్ విగ్రహాలు, ఆయన చెప్పిన మాటలు తమిళనాడులోని పలు ఆలయాల ముందు ఉన్నాయి. శ్రీరంగంలోని ఆలయాల వెలుపల కూడా కనిపిస్తాయి.
అయితే ఈ బీజేపీ ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు ఇంకా స్పందించలేదు. ముఖ్యంగా డీఎంకే పెరియార్ సిద్ధాంతాలను ఫాలో అవుతోంది. పెరియార్ ని తమిళనాడులో ఆస్తిగా పరిగణిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అన్నామలై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎలా స్పందిస్తుందో చూడాలి.