Laughing Gas: నైట్రస్ ఆక్సైడ్ సాధారణంగా “లాఫింగ్ గ్యాస్”గా పిలుస్తుంటారు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. వినోద కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్న దీన్ని బుధవారం నుంచి నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ డ్రగ్‌ని ఉత్పత్తి చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ గ్యాస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Read Also: Delhi: ఢిల్లీ పాఠశాలలకు సెలవులు పొడిగింపు.. నవంబర్ 9 నుండి 18 వరకు మూత
బహిరంగ ప్రదేశాల్లో సుదీర్ఘ కాలం నైట్రస్ ఆక్సైడ్ వినియోగించడం, సంఘ వ్యతిరేక ప్రవర్తనకు కారణమయ్యే అవకాశం ఉందని, ఇది కమ్యూనిటీలు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తుందని, వీటిని మేము అంగీకరించమని బ్రిటన్ పోలీసింగ్ మినిస్టర్ క్రిస్ ఫిలిప్ అధికార ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా భ్రమను కల్పించే ఈ పదార్థం, ఇబ్బందికర ప్రవర్తనలకు ఆజ్యం పోస్తుందని, ఆరోగ్యానికి ముప్పుగా మారబోతోందని యూకే ప్రభుత్వం మరో ప్రకటనలో వెల్లడించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది. అయితే ఆరోగ్య సంరక్షణ, ఇతర పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్ ఆక్సైడ్‌ని వినియోగించడాన్ని నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం లాఫింగ్ గ్యాస్ ని దుర్వినియోగం చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనిష్టంగా రెండేళ్ల నుంచి గరిష్టంగా 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
నైట్రస్ ఆక్సైడ్ పీలిస్తే ఇది సంతోషాన్ని, భ్రమను కల్పిస్తుంది. అయితే బ్రిటన్ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, యూకేలో 16-24 ఏళ్ల వయసు ఉన్న వారు ఎక్కువగా ఉపయోగిస్తున్న మూడో డ్రగ్ నైట్రస్ ఆక్సైడ్. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తహీనత బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే లాఫింగ్ గ్యాస్ ని నిషేధించాలని ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వం ప్రతిపాదించగా.. తాజాగా ఇది అమలులోకి వచ్చింది.