Tallest flag in india on the Attari border: దేశంలో అత్యంత ఎత్తైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధం అవుతోంది. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ లోని అట్టారీ వద్ద 418 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రెండు దేశాల మధ్య జెండా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. అట్టారీ-వాఘా బార్డర్ వద్ద పాకిస్తాన్ వైపు భారత్ కన్నా పెద్దదైన పాకిస్తాన్ జెండాను ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా ఇండియా దాని కన్నా ఎతైన జాతీయ జెండాను ఏర్పాటు చేయబోతోంది.
Read Also: KCR Delhi Visit: బీఆర్‌ఎస్ చీఫ్‌గా తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. విషయం ఇదేనా..?
భారత్ వైపు అట్టారీ బార్డర్ వద్ద 2017 మార్చిలో రూ.3.5 కోట్ల వ్యయంతో 360 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. అయితే దీని తర్వాత పాకిస్తాన్ అంతకన్నా ఎతైన జెండాను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ఈ ఏడాది ఆగస్టులో 400 అడుగుల పాకిస్తాన్ జెండాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దీని కన్నా ఎత్తు అంటే 418 అడుగుల జెండాను ఏర్పాటు చేయబోతోంది ఇండియా. ఇది పాకిస్తాన్ కన్నా 18 అడుగులు ఎక్కువ.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ ను నియమించిందని నేషనల్ హైవే అథారిటీ అధికారి వెల్లడించారు. జెండా మార్చే పని బహుశా 15-20 రోజుల్లో ప్రారంభం అవుతుందని.. జెండాను ఏర్పాటు చేసే ప్రదేశం ఇంకా నిర్ణయించ లేదని.. బీఎస్ఎఫ్ సూచన మేరకు జాయింట్ చెక్ పోస్టు ఆడియన్స్ గ్యాలరీకి దగ్గరలో ఉండే అవకాశం ఉందని.. గ్యాలరీ ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బీటింగ్ రిట్రీట్ చూసేందుకు వచ్చే ప్రజలకు జాతీయ జెండా సరిగ్గా కనిపించడం లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న జెండాను తొలగించే ప్రణాళిక లేదని.. అయితే కొత్త ప్లాగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని.. ఒక నెలలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెలగావి కోట వద్ద 361 అడుగుల అత్యంత ఎత్తైన జాతీయ జెండా ఉంది. దీని ఎత్తు అట్టారీ బార్డర్ లో ఉన్న జెండా కన్నా ఒక అడుగు ఎక్కువ.