ఇండియాలో మరోసారి మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు అయింది. ఇటీవల బ్రిటన్ నుంచి పశ్చిమ బెంగాల్ కు వచ్చిన మిడ్నాపూర్ వాసికి ఒళ్లంతా దద్దర్లతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చేరడం ఆందోళన పెంచింది. అయితే తాజాగా మరో అనుమానిత కేసు కేరళలో నమోదు అయింది. గతంలో కూడా నిఫా, కరోనా వంటి కేసులు ముందుగా కేరళలోనే బయటపడ్డాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ఇటీవల కేరళలోకి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
ప్రస్తుతం సదరు వ్యక్తి నమూనాలను పూణేలోని నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అయితే మంకీపాక్స్ చాలా వరకు ప్రాణాంతకం కాదు. సాధారణం స్మాల్ పాక్స్ లో ఉండే లక్షణాలే ఇందులో ఉంటాయి. వారం లేదా 10 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొన్ని సార్లు మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం 57 దేశాల్లో 8200 కేసులు వెలుగులోకి వచ్చాయి.
మే నెలలో తొలిసారి బ్రిటన్ లో ఈ వ్యాధి బయటపడింది. సెంట్రల్ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధిని మొదటగా గుర్తించారు. ఆ తరువాత నుంచి యూరోపియన్ దేశాల్లో వరసగా కేసుల సంఖ్య పెరగింది. ప్రపంచంలోని మొత్తం కేసుల్లో ఒక్క యూరప్ లోనే 80 శాతానికి పైగా ఉన్నాయి. యూఎస్ఏ, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, ఆస్ట్రేలియా, కెనడా, ఆస్ట్రియా, కానరీ దీవులు, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ దేశాలతో పాటు మరికొన్నిదేశాల్లో ఈ వ్యాధి బయటపడింది.