Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్, దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తోయిబాతో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది. అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసింది. ముఖ్యంగా పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని 09 ఉగ్రస్థావరాలపై 24 దాడుల్ని చేసింది. ఈ దాడుల్లో మొత్తం 80 నుంచి 100 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదానికి పాల్పడితే మీ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తామని పాకిస్తాన్‌కి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది.
పీఓకేలో “సర్జికల్ స్ట్రైక్స్”:
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కి మరోసారి భారత్ గత దాడుల్ని గుర్తు చేసింది. అంతకన్నా తీవ్రమైన దాడులు చేస్తూ దాయాదిని భయపెట్టింది. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడిలో 20 మంది సైనికులు చనిపోగా, 21 మంది గాయపడ్డారు. దీని తర్వాత భారత్ తన పారామిలిటరీతో పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ చేయించింది. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, ట్రైనింగ్ సెంటర్లను నాశనం చేస్తూ ఉగ్రవాదుల్ని హతమార్చింది.
పాకిస్తాన్‌లో ‘‘బాలాకోట్ స్ట్రైక్స్’’:
ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయారు. దీనికి బదులుగా పాక్ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని బాలాకోట్‌పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. పీఓకే కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి, పాక్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి భారత్ దాడులు జరిపింది. ఈ దాడుల్ని భారత వైమానికదళం నిర్వహించింది. అయితే, ఈ రెండు దాడులు జరగలేదని పాక్ బుకాయిస్తూ వచ్చింది.
సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ కలిపితే ఆపరేషన్ సిందూర్:
అయితే, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ అంతకుమించి పాకిస్తాన్‌ని వణికించింది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడు కలిసి ఈ ఆపరేషన్‌ని పూర్తి చేశాయి. గతంలో కన్నా భిన్నంగా తమపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంది. సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ కలిస్తే ‘‘ఆపరేషన్ సిందూర్’’గా చెప్పవచ్చు. ఈ ఆపరేషన్‌లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)తో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని మురిడ్కే, సియాల్ కోట్, బహవల్పూర్ ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. స్కాల్ప్, హామర్ వంటి అత్యాధునిక క్షిపణుల్ని ఉపయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించారు.