Supreme Court Upholds Centre’s Note Ban Move: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కేంద్ర నిర్ణయాన్ని తప్పు పడతూ మొత్తం 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటిని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని చెప్పింది.
Read Also: Demonetisation: పెద్ద నోట్ల రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నోట్ల రద్దు వివాదంపై కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు అయిన అన్ని పిటిషన్లను కొట్టేసింది. రూ. 1000, రూ.500 కరెన్సీ నోట్లు కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క ఆర్థిక విధానం అయినందున నిర్ణయాన్ని మార్చలేవని తీర్పు చెప్పింది. నోట్ల రద్దుకు ముందు కేంద్ర, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని సుప్రీంకోర్టు పేర్కొంది. నవంబర్ 8, 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దామాషా ప్రకారం నోట్ల రద్దు ప్రక్రియను కొట్టివేయలేవని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. నోట్ల మార్పిడికి నిర్దేశించిన 52 రోజుల వ్యవధి అసమంజసమని చెప్పలేమని ఆయన అన్నారు.
నోట్లరద్దును విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గావాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఎఎస్ బోపన్న, వి. రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు. ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వలో ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయింది. అయితే జస్టిస్ బీఆర్ గవాయ్ నోట్ల రద్దును సమర్థించగా.. జస్టిస్ నాగరత్న దీంతో విభేదించారు. నలుగురు న్యాయమూర్తులు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించగా.. ఒక్కరు విభేధించారు. 4-1 మెజారిటీతో నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.