కోల్‌కతా ఆర్‌జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు జీవితఖైదు విధించింది. రూ.50,000 జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితుడికి మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది.
అయితే నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ పెరగడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. దీంతో ఈ కేసును బుధవారం విచారించనుంది. జనవరి 20న సీల్దా కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది.
ఆగస్టు 9. 2024న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అయితే ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక ఈనెల 20న సీల్దా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించారు. సెక్షన్ 64 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఐదు నెలల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. అదనంగా సెక్షన్ 66 ప్రకారం అతనికి మరణశిక్ష వరకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని న్యాయమూర్తి దాస్ తెలిపారు. ఈ నేరం అరుదైన కేటగిరీ కిందకు రాదని, దోషికి మరణశిక్ష విధించకపోవడాన్ని న్యాయమూర్తి సమర్థించారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జనవరి 21న దోషికి మరణశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీర్పును విమర్శించారు. ‘‘ఇది నిజంగా మరణశిక్షను కోరే అరుదైన కేసు అని నేను నమ్ముతున్నాను. ఇది అరుదైన కేసు కాదని తీర్పు ఎలా నిర్ధారణకు వచ్చింది?!’’ అమె ధ్వజమెత్తింది.