వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వీధి కుక్కల సమస్యపై అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీలకు మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని.. లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఆదేశాలు అమలు చేయాలని కోరిన విషయం.. మీడియా ద్వారా అధికారులకు తెలియదా? దేశాన్ని అంతర్జాతీయంగా చెడుగా చిత్రీకరిస్తున్నా మీకు స్పందన ఉండదా? అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Rohini Kalam: విషాదం.. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య
జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణ నవంబర్ 3కు వాయిదా వేసింది. చీఫ్ సెక్రటరీలందరూ హాజరుకావాలని.. ఆడిటోరియంలో కోర్టు నిర్వహిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ హెచ్చరించారు. వీధి కుక్కలకు వాక్సినేషన్ జరపాలని, రేబిస్ ఇతర వ్యాధులు సోకిన కుక్కలను బయటకు వదలొద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా స్పందించకపోవడంతో తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Rajasthan: ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం.. ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం.. వెలుగులోకి ఇలా..!