ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… కేంద్ర ప్రభుత్వ బుల్డోజర్ డ్రైవ్‌ను నిరసిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో నరేంద్ర మోడీ సర్కార్ ఈ ప్రాంతంలోని ముస్లింల నివాసాల కూల్చివేతను ప్రారంభించిందని మండిపడుతున్నారు.. మరోవైపు.. షాహీన్‌బాగ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. కోర్టును ఆశ్రయించినవారిలో బాధితులు లేరని సుప్రీం పేర్కొంది.. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. షాహీన్‌బాగ్‌లో ఆక్రమణల కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించాలని బాధితులకు, పిటిషనర్లకు సూచించింది సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా.. సుప్రీంకోర్టును రాజకీయాలకు వేదిక చేయొద్దని జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం సూచించింది.
కాగా, షాహీన్ బాగ్ కూల్చివేతలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీపీఎం.. దీనికి విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక, రెండేళ్ల క్రితం పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల సందర్భంగా వెలుగులోకి వచ్చిన షాహీన్ బాగ్, ఈరోజు కూల్చివేతల డ్రైవ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.. షాహీన్ బాగ్ మరియు ఇతర ప్రాంతాలలో సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన కూల్చివేతలకు వ్యతిరేకంగా సీపీఎం చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది, కోర్టును ఆశ్రయిస్తున్నది రాజకీయ పార్టీ అని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.