Supreme Court: కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించింది. బాధితురాలి గుర్తింపును ఏ విధంగా బహిర్గతం చేయకూడదని, బాధితురాలి ఫోటో, ఆమె గుర్తింపుకు సంబంధించి ఏదైనా కంటెంట్ వెంటనే తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు వికీపీడియాను ఆదేశించింది.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
Read Also: PM Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు హిందూ దేవాలయంపై ఖలిస్తాన్ల దాడి
లైంగిక వేధింపుల బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఆ సమయంలో సీజేఐ అన్నారు. 2018లో నిపుల్ సక్సేనా కేసులో.. ఏ వ్యక్తి కూడా బాధితురాలు/బాధితుడి ఫోటోలను ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో బహిర్గం చేయకూడదు. ఇది వారి గుర్తింపుని ప్రజలకు విస్తృతంగా తెలియజేస్తుందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆగస్టు 09న ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ సెమినార్ హాలులో అర్ధనగ్నంగా మృతదేహమై కనిపించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా బాధితురాలికి న్యాయం చేయాలని నిరసనకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు. అప్పటి కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.