కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాపులారిటీ ఉంటే ఏది పడితే అది మాట్లాడటానికి సమాజం అనుమతించదని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటి షోలు చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Congress: కొత్త సీఈసీ నియామకంపై కాంగ్రెస్ అసంతృప్తి.. రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య
రణవీర్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు వ్యతిరేకంగా అల్హాబాదియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. అతని మనసులో ఏదో మురికి ఉందని.. దాన్ని యూట్యూబ్ షోలో కక్కేశాడని న్యాయస్థానం పేర్కొంది. సమాజంలో విలువలు అంటే ఏమిటి? దాని పారామితులు ఏమిటి, మీకు తెలుసా? అని ప్రశ్నించింది. సమాజంలో కొన్ని పరిమితులు, విలువలు ఉంటాయని… వాటిని గౌరవించాలని తెలిపింది. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా? అని ఏది పడితే అది మాట్లాడడానికి సమాజ నిబంధనలు ఒప్పుకోవని చెప్పింది. షోలో అతడు ఉపయోగించిన మాటలు.. మహిళా సమాజాన్ని సిగ్గుపడేలా చేసిందని అభిప్రాయపడింది. అతడు ఉపయోగించిన మాటలు అశ్లీలత కాకపోతే.. ఇంకేంటి?, అతడిపై ఎందుకు ఎఫ్ఐఆర్‌లు బుక్ చేయకూడదు.. ఎందుకు అరెస్ట్ చేయకూడదని రణవీర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే అరెస్ట్‌పై తాత్కాలిక ఉపశమనం కల్పించింది. రణ్‌వీర్ తరపున మాజీ సీజేఐ డీవై. చంద్రచూడ్ కుమారుడు అభినవ్ వాదనలు వినిపించారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహాయుతి కూటమిలో చీలిక.. షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు