CM MK Stalin: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని అధికార డీఎంకే అధ్వర్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిరాహార దీక్షలు జరిగాయి. నీట్ నుంచి తమిళనాడును మినహాయించే దాకా పోరాటం ఆగదని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో నిరాహార దీక్షలను కొనసాగించారు. నీట్ రద్దు అనేది రాజకీయపరమైన డిమాండ్ కాదని, అందిరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారం చేపడితే తమిళనాడులో ‘నీట్’ పరీక్ష ఉండదని సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే యువజన విభాగం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేపట్టిన సందర్భంగా స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ పరీక్ష రద్దు కోసం డీఎంకే చేస్తున్న పోరాటం రాజకీయ అభ్యర్థన కాదని, సామాజిక సమానత్వ విద్య కోరుకునే తమిళనాడు ప్రజల డిమాండ్ అని తెలిపారు. నిరాహారదీక్షలను విజయవంతం చేసినవారందరికీ అభినందనలు తెలిపారు.
Read also: Jio Financial Share: నేడు మార్కెట్లోకి రాబోతున్న జియో ఫైనాన్షియల్.. ఇది ఎంత సంపాదించగలదో తెలుసా?
చెన్నైలో చేపట్టిన నిరాహారదీక్షకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వం వహించారు. సాయంత్రం దీక్ష విరమించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని, లేదా రాష్ట్రానికి మినహాయింపునివ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యతిరేక నీట్ బిల్లుకు అనుకూలంగా తాను ఎప్పటికీ సంతకం చేయనని ఇటీవల ప్రకటించిన తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై కూడా స్టాలిన్ విరుచుకుపడ్డారు. ఈ అంశం రాష్ట్రపతి వద్ద ఉందని, రాష్ట్ర అసెంబ్లీ చేపట్టే అంశాలను రాష్ట్రపతి భవన్‌కు పంపాల్సిన పని గవర్నర్ చేయాలని సీఎం అన్నారు. అన్నాడీఎంకే భారీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్న మధురైలో మినహా రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నిరాహార దీక్షలు జరిగాయి. టెంపుల్ సిటీలో ఆగస్టు 23న నీట్ సమ్మె జరగనుంది. డీఎంకే యువజన విభాగం, విద్యార్థి విభాగం, వైద్యుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సమ్మె జరిగింది.
కొత్తగా పెళ్లయిన జంటలు కూడా నీట్ వ్యతిరేక బ్యానర్లు పట్టుకుని నిరసనకు దిగారు. నీట్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి తమ పార్టీ దానిని వ్యతిరేకిస్తోందని ఎంకే స్టాలిన్ పునరుద్ఘాటించారు. 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా నీట్‌ను అమలు చేశామని.. గతంలో అన్నాడీఎంకే హయాంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లును వెనక్కి పంపారని, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా అప్పటి అధికార పార్టీ దానిని వెల్లడించలేదని ఆయన అన్నారు. ఆ బిల్లు తర్వాత లాప్స్ అయిందని, 2021 ఎన్నికలకు ముందు తమ పార్టీ నీట్ నిషేధం కోసం హృదయపూర్వకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చిందని స్టాలిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ పోరాటం కొనసాగుతుందని, నీట్ మినహాయింపు వచ్చే వరకు డీఎంకే ఆగదని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ ఉద్యమం ప్రజల కోసం పని చేస్తుందని సీఎం తెలిపారు.