భారత్లో ఒమిక్రాన్ కేసులు…రోజు రోజుకు పెరుగుతున్నాయ్. క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ వేడుకలపై…పలు రాష్ట్రాలు నిషేధం విధించాయ్. గుజరాత్, మధ్యప్రదేశ్ నైట్ కర్ఫ్యూ విధించాయ్. పబ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లలో డీజేల వినియోగంపై కర్ణాటక నిషేధం విధించింది.
ఒమిక్రాన్…దేశంలో కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్ కేసులతో పాటు కొవిడ్ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ్. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని… వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన ఆంక్షల్ని తెరపైకి తీసుకొచ్చాయి. రాత్రిపూట కర్ఫ్యూని అమలు చేయాలని మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే దాక రోజూ రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు.
ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరగడంతో కేజ్రీవాల్ సర్కార్ అలర్టయింది. క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాలపై నిషేధం విధించింది. ఈ వేడుకలను సామూహికంగా జరుపుకోకూడదని స్పష్టం చేసింది. మాస్కులు ధరించని వారిని అనుమతించొద్దని వాణిజ్య సంఘాలను ఆదేశించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది.
ముంబైలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆరడుగుల భౌతికదూరం పాటించాలని స్పష్టం చేసింది. ఏవైనా వేడుకలు, సమావేశాలను 50శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించుకోవాలని, కొవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ నెల 31 వరకు ముంబైలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు గుజరాత్ సర్కార్ వెల్లడించింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహక కార్యక్రమాలు చేపట్టరాదని, సామూహిక వేడుకలకు అనుమతిలేదని తెలిపింది. పబ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లలో డీజేల వినియోగంపై నిషేధం విధించింది.
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కూడా నిబంధనలు విధించింది. నోయిడా, లఖ్నవూ జిల్లాల్లో డిసెంబర్ 31 వరకు 144 సెక్షన్ను అమలు చేయాలని నిర్ణయించింది. హరియాణా ప్రభుత్వం కూడా పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తిగా టీకాలు వేసుకోని వారిని జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని నిర్ణయించింది.