ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులతో బేజారైపోతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేసేందుకు ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ సిద్దమయ్యారు. ఢిల్లీలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అటెండ్ అవుతారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై నేతల నుంచి వివరాలను తీసుకోనున్నారు సోనియా. పార్టీలో నెలకొన్న వర్గవిభేదాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది.
Read Also: IPL: నేటి నుంచి ఐపీఎల్ షురూ… ఇక రచ్చ రచ్చే..
ఇప్పటికే సీనియర్లు జీ-23 పేరుతో కాంగ్రెస్ పార్టీని, గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు పార్టీ ప్రాభవాన్ని కోల్పోతున్న తీరుపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ప్రక్షాళన అవసరమంటున్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ నాయకత్వ సంక్షోభం ముదురుతోంది. దీంతో పార్టీలో పెనుమార్పులు ఖాయమన్న వార్తలతో, సోనియా గాంధీ అధ్యక్షత జరిగే తాజా మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో, దేశవ్యాప్తంగా ఆందోళనలపై కార్యాచరణను సోనియా ప్రకటిస్తారని తెలుస్తోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన ఆందోళనలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మొత్తానికి పార్టీ తీవ్ర సంక్షోభంలో వున్న పరిస్థితుల్లో సోనియా అధ్యక్షతన జరగనున్న సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.