ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. సీడబ్ల్యూసీలో ప్రారంభోపన్యాసం చేసిన ఆమె.. చాలా స్పష్టంగా నాయకులకు ఇలా దిశానిర్దేశం చేశారు. మనలో ప్రతిఒక్కరి జీవితాలకు పార్టీయే ప్రధాన కేంద్ర బిందువు, ప్రస్తుత పరిస్థితుల్లో నిస్వార్థంగా, క్రమశిక్షణతో, నిలకడగా, సమిష్టి బాధ్యత అనే స్పృహతో దృఢతరమైన పట్టుదల, దీక్షను ప్రదర్శించాలే తప్ప, ఇతరత్రా వేరే మంత్ర దండాలు ఏమీ లేవని స్పష్టం చేశారు సోనియా గాంధీ.
Read Also: Minister Peddireddy: పవన్ క్లారిటీ ఇవ్వాలి.. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..?
రెండున్నర గంటలపాటు సాగిన కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నత స్థాయి సమావేశంలో.. నాయకులకు చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు సోనియా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంతవరకు ప్రతిఒక్కరికీ ఎంతో మంచి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. నాయకుల అంకితభావాన్ని, మద్దతును పూర్తిస్థాయిలో ఆశిస్తోందన్నారు. ప్రస్తుతం అత్యంత కీలక పరిస్థితులు నెలకున్న తరుణంలో, ఓ అడుగు ముందుకేసి, మరింత చొరవతో, పూర్తి స్థాయిలో పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు సోనియా గాంధీ.