పశ్చిమ బెంగాల్ భీర్భూమ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి… బీర్‌భూం జిల్లాలో పర్యటించిన మమతా బెనర్జీ… హింసాకాండ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. సజీవ దహనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేతను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆధునిక బెంగాల్‌లో ఇంతటి అనాగరిక ఘటన జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదన్న దీదీ… భాదు షేక్ హత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు. రామ్‌పుర్‌హాట్ బ్లాక్ ప్రెసిడెంట్, టీఎంసీ నేత అనరుల్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. దీంతో పోలీసులు అనరుల్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు.
Read Also: Rahul Gandhi and PK Meet: రాహుల్‌తో పీకే భేటీ..? గుజరాత్ ఎన్నికల కోసం రంగంలోకి..!
మంటల్లో ధ్వంసమైన ఇళ్లను బాగుచేసేందుకు మమత లక్ష పరిహారం ప్రకటించారు. అవి సరిపోవని బాధితులు చెప్పడంతో… ఆ మొత్తాన్ని 2లక్షలకు పెంచారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. రామ్‌పుర్‌హాట్ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో… ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలకు రామ్‌పుర్‌హాట్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. వీరి శరీరాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సజీవ దహనానికి ముందు వీరిని అత్యంత తీవ్రంగా కొట్టినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీని వెనుక అనరుల్ ఉన్నట్లు స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా అతడిని అరెస్టు చేశారు. ఇప్పటికే 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.